తెలంగాణలో తెరాస నేత పాడి కౌశిక్‌రెడ్డిని (Koushik Reddy) ఎమ్మెల్సీగా నియమించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ (Tamilisai Soundararajan) తెలిపారు. కౌశిక్‌రెడ్డి నియామకానికి సంబంధించి మంత్రివర్గం సిఫార్సు చేసిందని చెప్పారు. ఆ సిఫార్సును మరింత అధ్యయనం చేయాల్సి ఉందని గవర్నర్ తెలిపారు. సామాజిక సేవా విభాగంలో పంపినందున పరిశీలిస్తున్నానని వివరించారు. గవర్నర్‌గా రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాతిక్రేయులతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వం పెండింగ్‌లో ఉందని గవర్నర్ (Tamilisai Soundararajan) సమాధానం ఇచ్చారు.
గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ స్థానానికి ఎంపిక చేస్తూ రాష్ట్ర కేబినెట్ సిఫార్సు చేసినప్పటికీ ఆ ఫైల్ తన వద్ద పెండింగ్‌లో ఉన్నట్టు గవర్నర్ తెలిపారు. ఆ స్థానాన్ని సామాజిక సేవ చేసిన వారికి ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో కౌశిక్ రెడ్డి చేసిన సేవలకు సంబంధించి తాను మరింత పరిశీలించాల్సి ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎంపికపై నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
'కౌశిక్ రెడ్డి నియామకంపై మంత్రివర్గం సిఫార్సు చేసింది. మంత్రివర్గ సిఫార్సును మరింత అధ్యయనం చేయాల్సి ఉంది. సామాజిక సేవ విభాగంలో పంపినందున పరిశీలిస్తున్నాం. కౌశిక్ రెడ్డి ఫైల్ పరిశీలనకు మరింత సమయం పట్టొచ్చు.'