Governor protocol controversy: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వరంగల్ పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ ఉల్లంఘన మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాకతీయ యూనివర్సిటీలో జరుగుతోన్న 22వ స్నాతకోత్సవంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే స్నాతకోత్సవానికి హాజరైన గవర్నర్‌కు జిల్లా కలెక్టర్, వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారిక స్వాగతం పలకకపోవడం తీవ్ర చర్చగా మారింది. జిల్లా ఉన్నతాధికారులు రాకుండా ఆర్డీవో, డీసీపీ మాత్రమే స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నా ప్రొటోకాల్ గురించి మీరు గమనిస్తున్నారు కదా అంటూ గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం కాకతీయ విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవంలో తెలంగాణ గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎదగాలనే ఆశ ఉంటే ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని.. ఆ సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. విద్యార్థులు జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ వ్యక్తిత్వ వికాసం సాధించాలని సూచించారు. కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంచుకోవాలన్నారు.