TS Police Jobs: తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎన్ని పోస్టులంటే..! - రాష్ట్రంలో పోలీసు పోస్టుల మేళా.
TS Police Jobs: తెలంగాణ ప్రభుత్వం పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. 16,614 ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసింది. మే 2 నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యూనిఫాం పోస్టులకు మూడేళ్ల గరిష్ఠ వయోపరిమితి సడలింపు ఇచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన 80 వేల ఉద్యోగాల్లో మొదటి ప్రకటన పోలీసుశాఖ నుంచే రావడం విశేషం.
తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగాల మేళా
By
Published : Apr 26, 2022, 7:47 AM IST
TS Police Jobs: తెలంగాణ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. పోలీసుశాఖతో పాటు ఎస్పీఎఫ్, అగ్నిమాపక, జైళ్లశాఖలో 16,614 పోస్టుల భర్తీకి నియామక ప్రకటన వెలువడింది. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు సోమవారం నాలుగు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు www.tslprb.in వెబ్‌సైట్ ద్వారా మే 2 నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉద్యోగాల వారీగా విద్యార్హతలు, వయో పరిమితి, సిలబస్ తదితర వివరాలు వెబ్‌సైట్లో పొందుపరిచామని తెలిపారు. యూనిఫాం పోస్టులకు ఈ నోటిఫికేషన్లోనూ మూడేళ్ల గరిష్ఠ వయోపరిమితి సడలింపు ఇచ్చారు. ఒకేసారి 16 వేలకు పైగా పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రకటన వెలువడడంతో నిరుద్యోగుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే సన్నద్ధత మొదలుపెట్టిన యువత తాజా ప్రకటన నేపథ్యంలో దాన్ని మరింత ముమ్మరం చేయనుంది.
ఇవీ అర్హతలు... (ఎస్సై పోస్టులు):2022 జులై 1వ తేదీ నాటికి 21 ఏళ్లు నిండి, 25 ఏళ్లు దాటకుండా ఉండాలి. అంటే 1997 జులై 2 కంటే ముందు, 2001 జులై 1 తర్వాత పుట్టి ఉండకూడదు. గరిష్ఠ వయోపరిమితిలో 3 ఏళ్ల సడలింపునిచ్చారు. దేశంలో ఏదైనా గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి కనీసం డిగ్రీ అర్హత ఉండాలి.
కానిస్టేబుల్, ఫైర్‌మెన్, వార్డర్ ఉద్యోగాలు...:2022 జులై 1 నాటికి 18 ఏళ్లు నిండి 22 ఏళ్లు దాటకుండా ఉండాలి. అంటే 2000 జులై 2 కంటే ముందు... 2004 జులై 1 తర్వాత పుట్టి ఉండకూడదు. రెండేళ్ల కాలంలో కనీసం 365 రోజులు విధులు నిర్వర్తించి, ఇప్పటికీ కొనసాగుతున్న హోంగార్డులైతే కనీసం 18 ఏళ్ల వయసు నిండి, 40 ఏళ్లు దాటకుండా ఉండాలి. మహిళా కానిస్టేబుల్ (సివిల్, ఏఆర్), మహిళా వార్డర్లకు మరికొన్ని మినహాయింపులిచ్చారు. వితంతువులు, చట్టపరంగా భర్త నుంచి విడాకులు పొంది, మళ్లీ పెళ్లి చేసుకోని వారిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 18 ఏళ్లు నిండి, 40 ఏళ్లు మించకుండా ఉండాలి. మిగతా కులాల్లో 18-35 మధ్య వయసున్న వారు అర్హులు. కనీస విద్యార్హత ఇంటర్మీడియట్.
ఎస్సై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పోలీసు ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్, ఏఎస్సై ఫింగర్ ప్రింట్ బ్యూరో...
2022 జులై 1వ తేదీ నాటికి 21 ఏళ్లు నిండి, 25 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎస్సై ఉద్యోగాలకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో దేశంలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఈ, బీటెక్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
పోలీసు ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్‌లో ఎస్సై ఉద్యోగాలకు ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ విభాగాల్లో రాష్ట్ర సాంకేతిక విద్యామండలి లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తత్సమానమైన విద్యా సంస్థ నుంచి డిప్లొమా పొంది ఉండాలి.
ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ఏఎస్సై ఉద్యోగాలకు కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఓసీ, బీసీ కులాలకు చెందిన స్థానికులైతే రూ.1,000, ఎస్సీ, ఎస్టీలైతే రూ.500, స్థానికేతరులైతే కులాలతో సంబంధం లేకుండా రూ.1,000 చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
పోలీసు ఉద్యోగాలన్నిటికీ ప్రభుత్వం 3 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చింది. అన్ని ఉద్యోగాలకు 2022 జులై 1వ తేదీ నాటికి సంబంధిత విద్యార్హతలో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎస్సైతోపాటు స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ ఉద్యోగాలకు ఓసీ, బీసీ స్థానిక అభ్యర్థులు రూ.1000 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ స్థానికులైతే రూ.500, స్థానికేతరులైతే అన్ని కేటగిరీలవారూ రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.
కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఓసీ, బీసీ వర్గాలకు చెందిన స్థానికులైతే రూ.800, ఎస్సీ, ఎస్టీలయితే రూ.400, స్థానికేతరుతైలే అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.800 చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించాలి.