ఆంధ్రప్రదేశ్

andhra pradesh

palamuru-rangareddy: పాలమూరు - రంగారెడ్డిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి

కృష్ణాజలాల వివాదం నేపథ్యంలో పాలమూరు - రంగారెడ్డి(palamuru-rangareddy) ఎత్తిపోతల పథకం పూర్తిచేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇటీవల జరిగిన కేబినెట్​ భేటీలోనూ.. ఈ పథకం పనుల పురోగతిపై ఆరా తీసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులు, ఇంజినీర్లకు సూచించారు.

By

Published : Jul 11, 2021, 7:39 AM IST

Published : Jul 11, 2021, 7:39 AM IST

Palamuru Rangareddy Project
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్​

పాలమూరు - రంగారెడ్డి(palamuru-rangareddy) ఎత్తిపోతల పథకం పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. పనుల్లో వేగం పెంచడం సహా అవసరమైన అనుమతుల ప్రక్రియను పూర్తి చేసే దిశగా కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా పర్యావరణ అనుమతుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.

త్వరలోనే సర్వే..

ఆంధ్రప్రదేశ్​తో వివాదం నేపథ్యంలో కృష్ణా జలాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాలుగా ముందుకెళ్తోంది. కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను పూర్తిగా కాపాడుకునేందుకు అన్ని రకాలుగా పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో కృష్ణానదిపై కొత్త ఆనకట్టతోపాటు ఎత్తిపోతల పథకాలు, కాల్వల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆయా పథకాల సవివర ప్రాజెక్టు నివేదిక తయారీ కోసం సర్వేకు అనుమతిస్తూ నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే సర్వే చేపట్టనుంది. వీటితోపాటు ప్రాజెక్టుల పనులు వేగవంతం దిశగా చర్యలు ప్రారంభించింది. కీలకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసేలా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించింది.

ఏపీ ఫిర్యాదుల నేపథ్యంలో..

ఇటీవల కృష్ణా జలాల అంశంపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిని తెలుసుకున్నారు. భూసేకరణ, పునరావాసంతోపాటు అనుమతుల ప్రక్రియపైనా చర్చించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను అక్రమంగా నిర్మిస్తున్నారన్న ఏపీ ఫిర్యాదు నేపథ్యంలో అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులు, ఇంజినీర్లను ఆదేశించారు. పర్యావరణ అనుమతుల కోసం కాల్వల పనులు జరుగుతున్న ప్రాంతాల్లో వెంటనే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలన్నారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నోటిఫికేషన్ జారీ చేసింది.

ఆగస్టు 10లోగా...

నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపనున్నారు. ప్రాజెక్టు పనుల కారణంగా ఆయా ప్రాంతాల్లో పర్యావరణ ప్రభావ మదింపు, పర్యావరణ నిర్వహణ ప్రణాళికల ముసాయిదాలను పీసీబీ అందుబాటులో ఉంచింది. వెబ్‌సైట్‌తోపాటు ప్రభావిత ప్రాంతాల్లోని స్థానిక సంస్థలు, సంబంధిత కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. వాటిపై ఆగస్టు 10లోగా సంబంధిత చీఫ్ ఇంజినీర్‌కు లిఖితపూర్వకంగా అభిప్రాయాలు, అభ్యంతరాలు అందజేయవచ్చు. ఆగస్టు పదో తేదీన ఆరు జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తారు. వచ్చిన అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వ వివరణలు కలిపి కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు నివేదిస్తారు.

ఇదీచూడండి:Telugu Academy: ఇకపై తెలుగు-సంస్కృత అకాడమీ.. పేరు మార్చిన ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details