గెజిట్ నోటిఫికేషన్ అమల్లో భాగంగా ప్రాజెక్టుల స్వాధీనం, నిర్వహణకు సంబంధించి కృష్ణానదీ యాజమాన్య బోర్డు(krishna river management board) మార్గదర్శకాలు బచావత్ ట్రైబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం(telangana government) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు. ప్రాజెక్టుల స్వాధీనం కోసం కేఆర్ఎంబీ ప్రతిపాదనల్లోని రూల్ కర్వ్స్, ఆపరేషన్ ప్రోటోకాల్స్‌ను నిపుణుల కమిటీ ఈ నెల 20వ తేదీన పరిశీలించిందన్న ఆయన... అవన్నీ బచావత్ ట్రైబ్యునల్ అవార్డుకు పూర్తి విరుద్ధంగా ఉన్నట్లు సమావేశం ఏకగ్రీవంగా అభిప్రాయపడిందని తెలిపారు.
KRMB: కృష్ణా బోర్డు ఇచ్చిన ప్రోటోకాల్‌పై తెలంగాణ అభ్యంతరం
గెజిట్ నోటిఫికేషన్ అమల్లో భాగంగా ప్రాజెక్టుల స్వాధీనం, నిర్వహణకు సంబంధించి కృష్ణానదీ యాజమాన్య బోర్డు(krishna river management board) మార్గదర్శకాలు బచావత్ ట్రైబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం(telangana government) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు.
జలవిద్యుత్ ప్రాజెక్టు అయిన శ్రీశైలం నుంచి బేసిన్ వెలుపలకు నీటిని మళ్లించరాదని ట్రైబ్యునల్ స్పష్టంగా పేర్కొందని... దీన్ని మార్చే అధికారం కృష్ణా బోర్డు(krishna river management board)కు, కేంద్ర ప్రభుత్వానికి లేదని లేఖలో స్పష్టం చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చే వరకు బచావత్ ట్రైబ్యునల్ అవార్డును పూర్తి స్థాయిలో పాటించాల్సిందేనన్న రజత్ కుమార్.. అంతరాష్ట్ర ఒప్పందం, ప్రణాళికా సంఘం ఆమోదం ప్రకారం శ్రీశైలం జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్ కేవలం 34 టీఎంసీల నీటిని మాత్రమే తీసుకోవాలని అన్నారు. సగటు వినియోగం గణాంకాల కోసం 2014-15 నుంచి ఏడేళ్ల సగటును తీసుకోవడం బచావత్ అవార్డుకు విరుద్ధమని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా సుజలస్రవంతి ద్వారా అక్రమంగా బేసిన్ వెలుపలకు నీటిని తరలిస్తున్న ఏపీ వాదనకు బలం చేకూర్చినట్లవుతుందని అన్నారు.
పరీవాహక ప్రాంతం లేకున్నప్పటికీ రెండు రాష్ట్రాల తాగు, సాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం నాగార్జున సాగర్ కీలకమని రజత్ కుమార్ అభిప్రాయపడ్డారు. శ్రీశైలం నుంచి దిగువకు నీరు విడుదల చేస్తేనే సాగర్‌కు జలాలు వస్తాయని... ఈ నేపథ్యంలో రెండు ప్రాజెక్టులకు సమీకృతంగా రూల్ కర్వ్ అవసరమని తెలిపారు. బచావత్ అవార్డు ప్రకారం రెండు జలాశయాల్లోనూ క్యారీ ఓవర్ స్టోరేజ్ కోసం నిబంధనలు పెట్టడం తప్పనిసరి అని లేఖలో పేర్కొన్నారు. వీటన్నింటి నేపథ్యంలో బచావత్ ట్రైబ్యునల్ అవార్డుకు లోబడి రూల్ కర్వ్స్, ఆపరేషన్ ప్రోటోకాల్స్ సవరించాలని కృష్ణా బోర్డు(krishna river management board)కు తెలంగాణ ప్రభుత్వం కోరింది.