కృష్ణా ట్రైబ్యునల్ నిబంధనలకు లోబడే శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం ద్వారా తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోందని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్ పేర్కొన్నారు. దీనిపై ఏపీ నిరాధారమైన, అవాస్తవ ఆరోపణలు చేస్తోందని తెలిపారు. ఏపీ ఫిర్యాదు మేరకు విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలంటూ తెలంగాణకు కృష్ణా బోర్డు లేఖ గత నెల 17న రాసింది. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డుకు ఈఎన్‌సీ తాజాగా లేఖ రాశారు. ఏపీ తప్పుదోవ పట్టిస్తోందని, వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని బోర్డు ఓ అభిప్రాయానికి రావాలని ఆయన కోరారు. జల విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు నిర్మించిన ప్రాజెక్టు నుంచి ఇతర అవసరాలకు నీటిని మళ్లించొద్దని ప్రణాళికా సంఘం సూచించిందని తెలిపారు. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-1 (KWDT-1) కూడా ఈ విషయం స్పష్టం చేసిందన్నారు. తెలంగాణ విద్యుదుత్పత్తితో ఏపీలో తాగునీటికి ఇబ్బంది ఏర్పడుతుందన్నది నిరాధారమైన అంశమని, అవసరాల మేరకే తమ వాటాను వినియోగించుకుంటున్నామని స్పష్టంచేశారు. లేఖతో పాటు పలు ఆధారాలను జత చేశారు.
లేఖలో పేర్కొన్న అంశాలు
* నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా కాలువల అవసరాలకు అనుగుణంగా శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి అనంతరం నీటి విడుదల ఉండేలా చూడాలని కేడబ్ల్యూడీటీ-1 సూచించింది.
* విద్యుత్ అవసరాలకు అనుగుణంగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 265 టీఎంసీలను సాగర్‌కు విడుదల చేసుకోవడానికి 1963లో ప్రణాళిక సంఘం అనుమతి ఇచ్చింది. ఇచ్చంపల్లి లేదా అలబాక నుంచి గోదావరి జలాలను సాగర్‌కు మళ్లించినా కనిష్ఠంగా 180 టీఎంసీల వరకు శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి ద్వారా సాగర్‌కు విడుదల చేయవచ్చు.