వార్షికాదాయం ఎనిమిది లక్షల్లోపు ఉన్న అగ్రవర్ణ పేదలందరికీ తెలంగాణలో పదిశాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఆర్థికంగా వెనకబడిన తరగతుల వారికి రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకటించింది. తహసీల్దార్ జారీ చేసే ఆదాయ ధ్రువపత్రం ఆధారంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు దక్కుతాయన్న సర్కార్... తప్పుడు పత్రాలని తేలితే వెంటనే సర్వీసు నుంచి తొలగించడం సహా చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించింది. ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల అమలుకు అనుగుణంగా సీట్లు పెంచాలని స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్ నియామకాల్లోనూ మహిళలకు మూడో వంతు కోటా ఉండనుంది.
తెలంగాణలో ఆర్థికంగా వెనకబడిన తరగతుల వారికి రిజర్వేషన్ల అమలుకు మార్గదర్శకాలు ఖరారయ్యాయి. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సాధారణ పరిపాలనా శాఖ మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేసింది.
పది శాతం రిజర్వేషన్లు..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణకు లోబడి రాష్ట్రంలోనూ ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు పదిశాతం రిజర్వేషన్లు అమలు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వర్తించని వారికి ఇవి దక్కుతాయి. కుటుంబం మొత్తానికి సంబంధించి అన్ని రకాల వార్షికాదాయం ఎనిమిది లక్షల రూపాయల్లోపు ఉన్న వారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అర్హులు. ముందు ఆర్థిక సంవత్సరంలో వేతనం, వ్యవసాయం, వ్యాపారం, ఇలా అన్ని రకాలుగా వచ్చిన ఆదాయాన్ని ఇందుకోసం పరిగణలోకి తీసుకుంటారు. తహసీల్దార్ ఇచ్చే ఆదాయ ధ్రువపత్రం ఆధారంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అర్హత ఉంటుంది.