Telangana on alert over new COVID variant: కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కరోనా పరిస్థితులు, వైద్య-ఆరోగ్యశాఖ సన్నద్ధతపై సమీక్షించారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్, రాష్ట్రంలో పరిస్థితులపై కేబినెట్‌కు నివేదించిన వైద్య,ఆరోగ్య శాఖ అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అవసరమైన ఔషధాలు, పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలని.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖను కేబినెట్ ఆదేశించింది. అందుకు అనుగుణంగా వైద్య, ఆరోగ్యశాఖ సిద్ధమవుతోంది. పడకలు, ఔషధాలు, పరికరాలతో పాటు మానవవనరులు కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసినట్లు తెలిపింది.
విదేశాల నుంచి వచ్చిన వారికి..
ఒమిక్రాన్ వేరియంట్‌ను దృష్టిలో ఉంచుకొని విదేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు తప్పనిసరి చేశారు. పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స కోసం గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసిన ప్రభుత్వం... నెగెటివ్ వచ్చిన వారిని హోంక్వారంటైన్లో ఉంచి పర్యవేక్షిస్తారు. నియంత్రణా చర్యలను పకడ్బందీగా చేయనున్నారు. అటు కరోనా నియంత్రణా చర్యలతో పాటు వ్యాక్సినేషన్‌పై వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. పురపాలక, పంచాయతీరాజ్, విద్యాశాఖల మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డిలను సభ్యులుగా నియమించారు. ఉపసంఘం ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య, విద్య, పురపాలక, పంచాయతీరాజ్ అధికారులతో దృశ్యమాధ్యమం ద్వారా సమావేశం కానుంది. ఆయా జిల్లాల్లో పరిస్థితులతో పాటు వ్యాక్సినేషన్‌పై సమీక్షించనున్నారు.
డిసెంబర్ నెలాఖరు నాటికి..