కొవిడ్ ప్రభావం తెలంగాణ పర్యాటక రంగంపై తీవ్రంగా పడింది. కరోనా, లాక్డౌన్తో పర్యాటక ప్రాంతాలన్నీ కళ కోల్పోయాయి. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల రాక కరవైంది. రెండో వేవ్ ప్రభావం తగ్గడంతో అన్ని రంగాలతో పాటే పర్యాటక రంగ కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యాయి. పర్యాటకం నెమ్మదిగా పుంజుకుంటోంది. అంతర్జాతీయ పర్యాటకులు లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దేశీయ పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి.
కొవిడ్ నిబంధనలకు లోబడి పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణ పర్యాటక శాఖ ప్రయత్నాలు చేస్తోంది. కాకతీయుల శిల్పా కళా వైభవానికి ప్రతీకగా నిలిచే రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ఇటీవల గుర్తించింది. ఈ పరిణామాన్ని బాగా ఉపయోగించుకునేందుకు పర్యాటకశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా అవసరమైన చర్యలు చేపట్టేందుకు సిద్దమవుతోంది.
ప్రపంచస్థాయి ప్రమాణాలతో..
తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కొత్త ప్యాకేజీలను అధికారులు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తెలంగాణలో ఉన్న చారిత్రక, పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలు సందర్శించేందుకు వీలుగా భిన్న ప్యాకేజీలు సిద్ధం చేస్తున్నారు. కొంత మంది సమూహంగా వెళ్లాలనుకుంటే వారి ఇండ్ల వద్దకే పర్యాటక శాఖ బస్సులు పంపేందుకు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సిద్దమైంది.