ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Unemployment: ప్రకటనల ఆలస్యంతో అనర్హులుగా నిరుద్యోగులు

డిగ్రీ పట్టా చేత పట్టుకుని.. ప్రభుత్వం చేసే ఉద్యోగాల ప్రకటన కోసం ఎదురు చూసినా ఫలితం లేకుండాపోతోంది. సర్కారు నోటిఫికేషన్​ విడుదల చేసేలోపు కొందరికి వయో పరిమితి కూడా దాటిపోతోంది. ప్రభుత్వం ఉద్యోగం చేయాలన్న వారి ఆశలు అడిశయాలు అవుతుండగా.. వారి భవితవ్యం ప్రశ్నార్థకమవుతోంది.

telangana-government
telangana-government

By

Published : Jul 3, 2021, 10:52 AM IST

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ప్రకటనల జారీలో జాప్యం నిరుద్యోగులకు ఇబ్బందిగా మారుతోంది. ఉద్యోగ ప్రకటనల్లో కీలకమైన నూతన జోన్ల విధానంలో చేసిన మార్పులకు రాష్ట్రపతి ఆమోదం లభించినా ప్రకటనలకు మరికొంత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. నూతన జోనల్‌ విధానం మేరకు సర్వీసు నిబంధనలు, పోస్టుల వర్గీకరణ, ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. గత రెండేళ్లుగా సర్వీసు నిబంధనలపై సాధారణ పరిపాలనశాఖ విభాగాల వారీగా సమావేశాలు నిర్వహించినప్పటికీ తుదిదశకు రాలేదు. తాజాగా ఈడబ్ల్యూఎస్‌ కోటా రిజర్వేషన్లు అమలు చేయడంతో ఆ మేరకు కొత్తరోస్టర్‌ పాయింట్ల పట్టికను రూపొందించాల్సి ఉంది. జోన్ల విధానంలో మార్పుల పేరిట మూడున్నరేళ్లుగా నియామక నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో అనుమతించిన గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు దాటిన నిరుద్యోగులు అనర్హులవుతున్నారు. గ్రూప్‌-1, 2, 3, 4, పోలీసు, ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీచేస్తామని రెండేళ్లుగా చెబుతున్నా నేటికీ ప్రకటన రాలేదు. తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ గణాంకాల మేరకు 2018 నాటికి 40 ఏళ్ల వయసు దాటిన దాదాపు 40 వేల మంది నిరుద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకమైంది. మరికొన్ని నెలల్లో వారిలో ఎక్కువ మంది అనర్హులు కానున్నారు. పోలీసు, విశ్వవిద్యాలయ తదితర ఉద్యోగాలు ఆశిస్తున్న సుమారు మరో 60 వేల మంది యువత కనీస వయోపరిమితి కూడా దాటుతోంది.

నిరుద్యోగులు 24.62 లక్షల మంది

టీఎస్‌పీఎస్సీ(TSPSC) వద్ద నమోదైన వివరాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడుతున్న నిరుద్యోగులు రాష్ట్రంలో దాదాపు 24.62 లక్షల మంది ఉన్నారు. కొత్త జోన్ల విధానం మేరకు సర్వీసు నిబంధనల సవరణ, పోస్టుల వర్గీకరణ తదితర కారణాలతో 2018 నుంచి టీఎస్‌పీఎస్సీలో ప్రకటనలు నిలిచిపోయాయి. అప్పటికే ఆమోదించిన 1,948 గ్రూప్‌-1, 2, 3, 4 కేటగిరీల పోస్టులకు సవరణ ప్రతిపాదనలను టీఎస్‌పీఎస్సీకి సర్కారు ఇంకా పంపలేదు. కొత్తగా ఏర్పాటు చేసిన బీసీ, మైనార్టీ సహా ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లోనూ దాదాపు 6 వేలకు పైగా పోస్టులకు ఆమోదం లభించింది. ఈ ప్రకటనకు సర్వీసు నిబంధన సవరణ అడ్డంకిగా మారింది. ఈ తరహా పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు. ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీలు, బోర్డుల ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితి 34 ఏళ్లు. మూడేళ్లుగా ఈ ఉద్యోగాలకు ప్రకటనలు రాకపోవడంతో నిరుద్యోగుల్లో నిరాశ నెలకొంది.

కలగానే పోలీసు కొలువులు..

పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు 22 ఏళ్లు, ఎస్సైలకు గరిష్ఠ వయోపరిమితి 25 ఏళ్లు. 2018లో ఉద్యోగ ప్రకటన వెలువడగా దాదాపు ఆరు లక్షల మంది పోటీపడ్డారు. అన్నిరకాల పరీక్షల్లో అర్హత మార్కులు సాధించినా పోలీసు నియామక బోర్డు ఖరారు చేసిన నిర్దేశిత కటాఫ్‌ మార్కులు అభ్యర్థులకు రాలేదన్న కారణంగా 3,500 పైగా పోస్టులు భర్తీ చేయలేదు. ఈ కటాఫ్‌ను కొంత తగ్గించి ఉంటే ఈ ఖాళీలు ఉండకపోయేవని, ఇప్పుడు బ్యాక్‌లాగ్‌గా మిగిలిపోయాయని నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. అప్పట్లో పోటీపడి ఉద్యోగాలు పొందలేకపోయిన కొందరి గరిష్ఠ వయోపరిమితి ఇప్పుడు దాటిపోయింది. దీంతో ఈ ఏడాది పోలీసుశాఖ భర్తీచేస్తామంటున్న 20 వేల పోస్టులకు వారు అనర్హులవుతారు.

ఇదీ చూడండి:'న్యాయవ్యవస్థను రక్షించే బాధ్యత లాయర్లదే'

ABOUT THE AUTHOR

...view details