Telangana fish brand : రాష్ట్రంలో మత్స్య సంపద నుంచి ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా ‘తెలంగాణ చేపలు’ అనే బ్రాండ్‌ను సృష్టించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. చేపపిల్లల పెంపకంపై ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నందున ఆదాయం కూడా అదే స్థాయిలో పెరిగేలా చూడాలని ‘హబ్-స్పోక్’ అనే పేరుతో ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రంలోని నీటి వనరుల్లో వదిలిన చేపపిల్లలు పెరిగి వేసవి సీజన్‌లోని కొన్ని నెలల్లో మాత్రమే మార్కెట్లకు వస్తున్నాయి. మిగతా నెలల్లో ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా కొర్రమీను, మేలురకం రొయ్యలు దిగుమతి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏడాది పొడవునా చేపలు లభించేలా నీటివనరుల్లో పెంచాలని మత్స్యశాఖను ప్రభుత్వం ఆదేశించింది. మత్స్యకారులకు ఆదాయం పెంచడమే కాకుండా, వినియోగదారులకు నాణ్యమైన చేపలు అందించాలన్నది దీని లక్ష్యం. మిగులు చేపలను ఇతర రాష్ట్రాలకు, విదేశాలకూ ఎగుమతి చేయనున్నారు.
హబ్-స్పోక్ ప్రణాళిక
*సైకిల్ చక్రంలో మధ్యలో ఉండే హబ్: టోకు చేపల మార్కెట్
*చక్రంలో ఉండే చువ్వలు: వివిధ ప్రాంతాల మార్కెట్లు
*ప్రతి జిల్లా కేంద్రంలో టోకు మార్కెట్ హబ్ ఏర్పాటు చేస్తారు. దాని నుంచి జిల్లాలోని చిల్లర మార్కెట్లకు, ఇతర ప్రాంతాలకు పంపుతారు.
కోహెడలో చేపల హబ్ ఏర్పాటుకు నిర్ణయం
గ్రేటర్ హైదరాబాద్ మార్కెట్లలో ఏటా లక్ష టన్నులకు పైగా చేపలు విక్రయమవుతున్నాయి. ఈ మార్కెట్‌ను మరింత విస్తరించేందుకు నగర శివారులోని కోహెడ వద్ద 10 ఎకరాల్లో రూ.50 కోట్ల వ్యయంతో అత్యాధునిక చేపల హబ్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఏడాదిలోగా దీని నిర్మాణం పూర్తిచేయాలని ప్రతిపాదించారు. ఇందుకు స్థలం కేటాయించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ హబ్‌ల ఏర్పాటుకు స్థలాలను అన్వేషిస్తున్నారు.