ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

IT HUB : హైదరాబాద్​లో మరో ఐటీ హబ్ - హైదరాబాద్​లో మరో ఐటీ హబ్

రానున్న రోజుల్లో ఐటీ సంస్థలకు డిమాండ్ ఎక్కువగా ఉండనున్న దృష్ట్యా హైదరాబాద్​లో మరో ఐటీ హబ్ ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. హైటెక్ సిటీ తరహా ఐటీ, ఐటీఈఎస్​ కంపెనీలు ఈ హబ్​లో ఏర్పాటు చేయనున్నారు.

telangana news
హైదరాబాద్​లో మరో ఐటీ హబ్

By

Published : Jul 15, 2021, 8:20 AM IST

రాష్ట్ర రాజధానిలో మరో ఐటీ హబ్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న రోజుల్లో ఐటీ, అనుబంధ సంస్థలకు గిరాకీ పెరగనున్న దృష్ట్యా హైదరాబాద్‌ పరిసరాల్లో ఐటీ హబ్‌ సిద్ధం చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు అత్యంత సమీపంలో ఉన్న కొల్లూరు, ఇదుళ్లనాగులపల్లి ప్రాంతాలు ఇందుకు అనువుగా ఉన్నట్లు గుర్తించింది. భూ సమీకరణ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు, ఇదుళ్లనాగులపల్లి, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొండకల్‌లో ఈ ప్రాజెక్టు రానుంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు 1.3 కిలోమీటర్ల దూరంలో 640 ఎకరాల భూమిని హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ) గుర్తించింది. హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ తరహాలో ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీలను ఈ హబ్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక ముసాయిదాను హెచ్‌ఎండీఏ రూపొందించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయాల్సి ఉంది.

భూ యజమానులకు 600 గజాల అభివృద్ధి చేసిన ప్లాట్లు

భూ సమీకరణ విధానం (ల్యాండ్‌ పూలింగ్‌ మెకానిజం)లో భాగంగా సేకరించే భూములకుగాను యజమానులకు ఎకరాకు 600 గజాల అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌ మెట్రో రైలు కోసం 2017లో ఉప్పల్‌లో చేపట్టిన తరహాలో భూమి సమీకరించనున్నారు. హెచ్‌ఎండీఏ గుర్తించిన 640 ఎకరాల్లో అధిక శాతం ప్రభుత్వ, సీలింగ్‌, మిగులు (సర్‌ప్లస్‌), ఎసైన్డ్‌ భూములు ఉన్నాయి. ఇవన్నీ ఖాళీగా ఉండటంతోపాటు వ్యవసాయ వినియోగ విభాగంలో ఉన్నాయి. గుర్తించిన భూమంతా దాదాపు పక్కపక్కనే ఉంది. 40 శాతం భూమి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన హెచ్‌ఎండీఏ పరం అవుతుంది. ‘ఈపీసీ’ ప్రాతిపదికన భూమిని అభివృద్ధి చేసేందుకు గుత్తేదారును ఎంపిక చేయాలని ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో హెచ్‌ఎండీఏ పేర్కొంది. మూడేళ్ల వ్యవధిలో ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక (ఏరియా డెవలప్‌మెంట్‌ ప్లాన్‌) అమలు చేయాలని నిర్ణయించింది. సాధ్యమైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది.

ఈ ప్రాజెక్టులో ప్రభుత్వానికి సుమారు 300 ఎకరాలు లభిస్తుందని అంచనా. అందులో 26(5 ఎకరాలను ఐటీ, ఐటీఈఎస్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలకు విక్రయిస్తుంది. మిగిలిన 35 ఎకరాలు మిగులు భూమి. ఇందులో గతంలో భూమిని కేటాయించిన (ఎసైన్‌) వారికి అభివృద్ధి చేసిన ప్లాట్లను ప్రభుత్వం కేటాయించాల్సి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా రూపొందించిన నివేదికలో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనతో ప్రభుత్వానికి ఖర్చు లేకుండా భారీ ఐటీ ప్రాజెక్టులకు భూమిని కేటాయించేందుకు మార్గం సుగమం అవుతుంది. ఆయా సంస్థలకు అభివృద్ధి చేసిన ప్లాట్ల విక్రయం ద్వారా రూ.వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని, వివిధ సంస్థల ఏర్పాటు ద్వారా పది లక్షల మందికిపైగా ఉపాధి లభిస్తుందని ప్రాథమిక అంచనాగా నివేదికలో హెచ్‌ఎండీఏ పేర్కొంది. ఐటీ అనుబంధ సేవా రంగాలు కూడా అక్కడ భారీగా విస్తరించేందుకూ అవకాశం ఉందని భావిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details