తెలంగాణలో పండిన యాసంగి వడ్లన్నీ రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రతి గ్రామంలో బుధవారం నుంచే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల నిర్వహణ, పర్యవేక్షణకు నలుగురు ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి కమిటీ వేస్తున్నామని ఇందులో ప్రధానకార్యదర్శి, ఆర్థిక, వ్యవసాయ, సాగునీటిశాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. ఉచిత విద్యుత్‌కు రూ.12 వేల కోట్లు, రైతుబంధుకు రూ.15 వేల కోట్లు, రైతుబీమాకు రూ.1,600 కోట్లు ఇస్తున్నట్టు తెలిపారు. ‘‘హైదరాబాద్‌లోని హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్(గండిపేట) జలాశయాల పరిరక్షణకు గతంలో జారీ చేసిన 111 ఉత్తర్వులను రంగారెడ్డి, వికారాబాద్ ప్రజల వినతి మేరకు ఎత్తివేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా నిర్వహించే గ్రూపు-1, గ్రూపు-2 ఉద్యోగాలకు మౌఖిక పరీక్షలు (ఇంటర్వ్యూలు) ఎత్తివేస్తున్నాం. పోలీసు ఉద్యోగ నియామకాలకు వయోపరిమితి 3 సంవత్సరాలు సడలించాలని నిర్ణయించాం. రాష్ట్రంలో కొత్తగా ఆరు ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతించాం’’ అని వెల్లడించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు.
బడా బడా కంపెనీలకు కేంద్రం రూ.10.50 లక్షల కోట్ల మాఫీ..:కేంద్ర ప్రభుత్వ చేతగానితనం వల్ల ధాన్యం కొనుగోళ్లతో రాష్ట్రంపై రూ.4 వేల కోట్ల భారం పడినా అన్నదాతల కోసం ఆ నష్టాన్ని భరిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. క్వింటాకు మద్దతు ధర కింద రూ.1,960ను ఠంచన్‌గా రైతు బ్యాంకు ఖాతాలో వేస్తామని తెలిపారు. వెంటనే జిల్లా కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సదస్సు నిర్వహించి, కొనుగోళ్లను వేగవంతం చేస్తామన్నారు. దేశంలో రైతులు సతమతమవుతుండగా వారిని కేంద్రం గతిలేనివారిలా చూస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు.‘నా సర్వశక్తులు ధారపోసి రైతుల తరఫున పోరాటానికి ముందుకెళ్తా’ అని ప్రకటించారు. ‘‘దాదాపు రూ.4 వేల కోట్ల నష్టాన్ని భరించి తెలంగాణలో ధాన్యం కొనలేం అని చెబుతున్న కేంద్రం బడాబడా కంపెనీలకు రూ.10.50 లక్షల కోట్లు మాఫీ చేసింది. ఒక దొంగ కంపెనీకి రూ.21వేల కోట్లు, అదానీ గ్రూప్‌నకు రూ.12వేల కోట్ల బ్యాంకు రుణం మాఫీ చేసింది. బ్యాంకులను రూ.వేల కోట్లకు ముంచిన బడా వ్యక్తుల్ని కేంద్రం కాపాడుతోంది. వాళ్లు పోయి లండన్‌లో కూర్చుంటారు. అక్కడ పిక్‌నిక్‌లో ఉన్న కార్పొరేట్ గద్దలను అరెస్టు చేయడానికి సీబీఐ పోతే కేంద్రం పెద్దలు వారిని వెనక్కి పిలిపించారు. అన్ని విషయాలను త్వరలో బయటపెడతాం. దేశాన్ని చైతన్యపరచడానికి తెలంగాణ నుంచి పోరాటాన్ని ఉద్ధృతం చేస్తాం.
రాష్ట్రం పన్నులు తగ్గించాలంటే మీరు ఎందుకు పెంచుతున్నారు?:మేం వచ్చినప్పటి నుంచి పెట్రోల్‌పై వ్యాట్ పెంచలేదు. పన్నుశాతంలో డెసిమల్ పాయింట్లు ఉంటే 2015లో కొంచెం రౌండ్‌ఫిగర్ చేశాం. తెలంగాణ చరిత్రలో పెట్రోల్, డీజిల్‌పై పెంచలేదు. రోజుకు రూపాయి, బారాణా చొప్పున కేంద్రం పెంచుతోంది. రాష్ట్రం పన్నులు తగ్గించాలంటే మీరు ఎందుకు పెంచుతున్నారు. మీ జేబు నిండాలి. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతం ఏంటంటే బలమైన కేంద్రం ఉండాలి. రాష్ట్రాలు బలహీనం కావాలి. వారి చెప్పుచేతల్లో రాష్ట్రాలుండాలి. సమాఖ్య స్ఫూర్తికి ఇది పూర్తి విరుద్ధం. అధికారాలన్నీ రాష్ట్రాలకు ఇవ్వాల్సింది పోయి ఉమ్మడి జాబితా పేరుతో లాక్కుంటున్నారు.
మోరీల్లా నోర్లు పెట్టుకుని ఇన్ని అరుపులా..:ధాన్యాన్ని మరపట్టిస్తే 33% నూకలొస్తే ఆ నష్టం కేంద్రం భరించాలి. దానికింత గగ్గోలు పెడతారా? రైతులను ఆదుకోవాలంటే మోరీల్లా నోర్లు పెట్టుకుని ఇన్ని అరుపులు.. పెడబొబ్బలా? కేంద్రం బాధ్యత మర్చిపోతున్నందునే మేం గడబిడ చేస్తున్నాం. దిల్లీలోనూ ఎండగట్టాం. కేంద్రం వద్ద ధనం లేదా లేక ప్రధానికి మనసు లేదా అని అడిగా? కేంద్ర మంత్రి మేం బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నాం అంటూ నీచంగా, నికృష్టంగా మాట్లాడతారా? కేంద్రం బాధ్యతారాహిత్యానికి ఇదొక ఉదాహరణ.
2 జలాశయాలూ కలుషితం కాకుండా చూస్తాం:వికారాబాద్, రంగారెడ్డి జిల్లా ప్రాంతాల్లో అమల్లో ఉన్న జీవో 111 ఎత్తివేయాలని మంత్రిమండలిలో నిర్ణయించాం. సీఎస్ ఆధ్వర్యంలో కాలుష్య, పర్యావరణ, అటవీ ఇతర శాఖలతో కలిపి కమిటీ వేశాం. ఎట్టి పరిస్థితుల్లో మూసీ, ఈసీ నది, రెండు జలాశయాలు కలుషితం కాకుండా చూస్తాం. గ్రీన్‌జోన్లను ప్రకటిస్తూ, మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని ఆదేశాలు జారీచేశాం. ఇది ఆ ప్రాంత ప్రజలకు శుభవార్త.
రెండో రన్‌వేపై జీఎమ్మార్‌కు సూచించాం..:రాష్ట్రంలో ఆరు ప్రైవేటు విశ్వవిద్యాలయాలను అనుమతించాం. అవి భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), కావేరి వ్యవసాయ విశ్వవిద్యాలయం, గురునానక్, ఎంఎన్‌ఆర్, ఎమిటీ, నిక్‌మార్. దీంతో పాటు ఔషధనగరి విశ్వవిద్యాలయాన్ని వెంటనే అందుబాటులోకి తీసుకురావడానికి నిర్ణయించాం. మహిళా వర్సిటీ ఏర్పాటుకూ మంత్రిమండలి ఆమోదించింది. ప్రపంచంలో పౌరవిమానయానం పెరుగుతోంది. హైదరాబాద్ విమానాశ్రయం దేశంలో నాలుగో పెద్దదిగా నిలుస్తోంది. దిల్లీ, ముంబయి, బెంగళూరు తరువాత హైదరాబాద్ నిలుస్తోంది. భూభాగం దృష్టా దేశంలో పెద్దది. దిల్లీ 5 వేల ఎకరాల్లో, హైదరాబాద్ విమానాశ్రయం 5,200 ఎకరాల్లో ఉండటం విశేషం. రెండో రన్‌వే నిర్మాణానికి జీఎమ్మార్‌కు సూచించాం. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి.
వర్సిటీల్లో నియామకాలకు ప్రత్యేక బోర్డు..:విశ్వవిద్యాలయాల్లోని మూడున్నర వేల ఖాళీలు భర్తీ చేపట్టాలని నిర్ణయించాం. వేరే రాష్ట్రాల మాదిరి విద్యాశాఖ ఆధ్వర్యంలో కామన్‌బోర్డు ఏర్పాటు చేసి బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టి ఆ వర్సిటీలకు అప్పగిస్తాం. విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల ఏర్పాటు కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ఇతర నగరాలకు విస్తరింపచేయాలి. వరంగల్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో నూతన ఉన్నత విద్యాసంస్థల స్థాపనను ప్రోత్సహించాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిని ఆదేశించాం.
చెన్నూరు ఎత్తిపోతల పథకానికి రూ.1,658 కోట్లు..:చెన్నూరు ఎత్తిపోతల పథకం కోసం మంత్రిమండలి రూ.1,658 కోట్లు నిర్దేశించింది. చెన్నూరు నియోజకవర్గంలో 5 మండలాల్లోని 103 గ్రామాలకు సాగు, తాగు నీటిని ఈ పథకం ద్వారా అందించనున్నారు. 10 టీఎంసీల గోదావరి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఈ పథకానికి వినియోగించనున్నారు. పార్వతీ బ్యారేజీ జలాశయం నుంచి జైపూర్, మందమర్రి మండలాల్లో 25,423 ఎకరాలకు.. సరస్వతి బ్యారేజీ జలాశయం నుంచి చెన్నూరు, భీమారం, కోటపల్లి మండలాల్లో 48,208 ఎకరాలకు... లక్ష్మీబ్యారేజీ జలాశయం నుంచి కోటపల్లి మండలంలోని 16,370 ఎకరాలకు సాగునీరు అందనుంది.