ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TRANSFERS: తెలంగాణలో ఉపాధ్యాయుల పరస్పర బదిలీకి పచ్చజెండా - teacher transfers in telangana

Transfers of government employees: ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందులో 2,558 మంది ఉపాధ్యాయులు కాగా మరో 1,500 మంది ఇతర శాఖల ఉద్యోగులున్నారు. పరస్పర బదిలీలపై హైకోర్టు తుది తీర్పునకు అనుగుణంగా అంగీకారపత్రం ఇచ్చిన వారిని వెంటనే బదిలీ చేయాలని ప్రభుత్వం ఆయా శాఖలను ఆదేశించింది.

TRANSFERS
తెలంగాణలో ఉపాధ్యాయుల పరస్పర బదిలీకి పచ్చజెండా

By

Published : Jun 21, 2022, 12:03 PM IST

Transfers of government employees: తెలంగాణలో నాలుగు వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది. ఇందులో 2,558 మంది ఉపాధ్యాయులు కాగా మరో 1,500 మంది ఇతర శాఖల ఉద్యోగులున్నారు. పరస్పర బదిలీలపై హైకోర్టు తుది తీర్పునకు అనుగుణంగా అంగీకారపత్రం ఇచ్చిన వారిని వెంటనే బదిలీ చేయాలని ప్రభుత్వం ఆయా శాఖలను ఆదేశించింది. దీనికి అనుగుణంగా విద్యాశాఖ, ఇతర శాఖలు ఉత్తర్వులు జారీ చేశాయి.

కొత్త జోనల్‌ విధానంలో చేపట్టిన ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియ అనంతరం ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల వినతి మేరకు పరస్పర బదిలీలకు అనుమతిస్తూ గత ఫిబ్రవరి రెండో తేదీన జీవో నం.21 జారీ చేసింది. పరస్పర బదిలీ జరిగితే ఆయా ఉద్యోగుల సీనియారిటీ అట్టడుగు స్థాయిలో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం తెలపడంతో అదే నెల 19న సవరణ ఉత్తర్వులు (జీవో నం.402) జారీ చేసింది. ఒకే ఉమ్మడి జిల్లాకు చెందిన ఉద్యోగులు పరస్పరం బదిలీ అయితే వారి సీనియారిటీ యథాతథంగా కొనసాగుతుందని అందులో ప్రభుత్వం పేర్కొంది. దీనిపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా.. సవరణ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. సీనియారిటీ అట్టడుగు స్థాయిలో ఉండేలా జీవో 21 మేరకే పరస్పర బదిలీ ప్రక్రియ కొనసాగించాలని ఆదేశించింది.

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ వేసింది. తుది తీర్పు రావాల్సి ఉంది. ఈలోపు ఉపాధ్యాయ సంఘాలు బదిలీల్లో జాప్యం జరగకుండా ప్రక్రియను కొనసాగించాలని కోరాయి. దీనిని ప్రభుత్వం పరిశీలించింది. ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉన్నందున తీర్పునకు కట్టుబడి ఉంటామని అంగీకార పత్రం ఇచ్చే ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఆయా శాఖలు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి అంగీకారపత్రాలను కోరాయి. దీనిపై స్పందించిన 2,558 మంది ఉపాధ్యాయులు ఆ పత్రాలను సమర్పించారు. వాటిని సాధారణ పరిపాలన శాఖ పరిశీలించింది. న్యాయశాఖ సలహా అనంతరం నాలుగు వేల మందికి పైగా బదిలీలకు అనుమతినిచ్చింది.

సమీక్షించిన విద్యాశాఖ మంత్రి..రాష్ట్ర ప్రభుత్వ అనుమతి నేపథ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలపై విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సోమవారం తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమై చర్చించారు. సంబంధిత ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు విద్యాశాఖ సంచాలకురాలు దేవసేన.. హైదరాబాద్‌, వరంగల్‌ ఆర్జేడీలు, అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై పీఆర్‌టీయూటీఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్‌రెడ్డి, కమలాకర్‌రావు, ఎమ్మెల్సీలు జనార్ధన్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రవీందర్‌, టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్‌, రాయకంటి ప్రతాప్‌, టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మమత, సత్యనారాయణలు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు సబితారెడ్డి, కేటీ రామారావు, హరీశ్‌రావులకు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details