ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాని(rayalaseema lift irrigation project)కి పర్యావరణ అనుమతులు మంజూరు చేయవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎక్స్ పర్ట్ అప్రైజల్ కమిటీ సభ్యకార్యదర్శికి నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎలాంటి నీటి కేటాయింపులు, అనుమతులు లేని అక్రమ ప్రాజెక్టు అని లేఖలో పేర్కొన్నారు. సీతారామ ఎత్తిపోతల సహా నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టులకు గతంలో పర్యావరణ అనుమతులు ఇవ్వలేదని గుర్తు చేశారు.
Rayalaseema Lift Irrigation Project: కేంద్ర పర్యావరణ శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ - ఏపీ తెలంగాణ జల వివాదం
![Rayalaseema Lift Irrigation Project: కేంద్ర పర్యావరణ శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ rayalaseema lift irrigation project](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12364055-313-12364055-1625491923191.jpg)
18:42 July 05
రాయలసీమ ఎత్తిపోతలపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ
బేసిన్ వెలుపలకు పెద్దమొత్తంలో నీటిని తరలించేందుకు రాయలసీమ ఎత్తిపోతల చేపట్టారని రజత్ కుమార్ తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతలతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందని... రోళ్లపాడు, గుండ్ల బ్రహ్మేశ్వరం, శ్రీ లంకామల్లేశ్వర, శ్రీ పెనుసిలా నరసింహ, శ్రీ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు ప్రాజెక్టు కాల్వలకు పది కిలోమీటర్ల పరిధిలోపే ఉన్నాయని రజత్ కుమార్ తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలు, ఛాయాచిత్రాలను లేఖతో జతపరిచారు.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ప్రాజెక్టు డీపీఆర్ ఇవ్వకుండా, తగిన అనుమతులు తీసుకోకుండా పనులు చేపట్టవద్దని ఎన్జీటీ గతంలోనే ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. 2020 అక్టోబర్లో జరిగిన అత్యున్నత మండలి సమావేశంలోనూ కేంద్ర జలశక్తిశాఖ మంత్రి ముందు రాయలసీమ ఎత్తిపోతల అంశాన్ని తెలంగాణ ప్రస్తావించిందని... కేంద్ర జలసంఘం అనుమతులు వచ్చే వరకు ప్రాజెక్టు పనులు ఆపాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీని ఆదేశించిందని వివరించారు. వీటన్నింటి నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల పరిశీలన నేపథ్యంలో న్యాయ, హైడ్రాలజికల్, పర్యావరణ అంశాలన్నింటినీ పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోవాలని రజత్ కుమార్ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖను కోరారు.
ఇదీ చదవండి
AP - TS Water Disputes: తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయండి: కేంద్రమంత్రికి సీఎం లేఖ