Women are allowed to work in companies at night: దుకాణాలు, కంపెనీలు, సంస్థల్లో నిర్దేశిత షరతులకు లోబడి మహిళా ఉద్యోగులు కూడా రాత్రి పూట విధులు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సరళతర వాణిజ్య విధానం అమల్లో భాగంగా రాత్రి ఎనిమిదిన్నర నుంచి ఉదయం ఆరు గంటల వరకు మహిళా ఉద్యోగులు విధులు నిర్వర్తించేందుకు అనుమతి ఇచ్చింది.
రవాణా సదుపాయం తప్పనిసరి:ఇందుకు మహిళా ఉద్యోగుల అంగీకారం తప్పనిసరి అని స్పష్టం చేసింది. మహిళా ఉద్యోగులు కార్యాలయానికి వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు ఉచితంగా రవాణా సదుపాయం కల్పించాలని.. వాటికి జీపీఎస్ వ్యవస్థ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించింది. మహిళా ఉద్యోగులకు రాత్రి విధులు రొటేషన్ విధానంలో అమలు చేయాలని.. కార్యాలయాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు లైంగిక వేధింపుల నుంచి భద్రతా చర్యలు, కనీసం ఐదుగురు మహిళా ఉద్యోగులు విధుల్లో ఉండేలా చూడాలని పేర్కొంది.