శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్తు కేంద్రం ద్వారా నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయడం రెండు రాష్ట్రాలకూ ప్రయోజనకరమని తెలంగాణ స్పష్టం చేసింది. ఈ మేరకు కృష్ణా నది యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. ఈ లేఖను బోర్డు.... ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖకు పంపింది.
ఆంధ్రప్రదేశ్‌కు పంపిన లేఖలో ముఖ్యాంశాలు..
- సాగర్‌కు నీటిని విడుదల చేయడం వల్ల రెండు రాష్ట్రాలకు తాగు, సాగునీటికి ఉపయోగపడుతుంది.
- బచావత్ ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం శ్రీశైలం జల విద్యుత్తు ప్రాజెక్ట్ దిగువన సాగర్, కృష్ణాడెల్టా అవసరాలకు 180 టీఎంసీలు విడుదల చేయాల్సి ఉంది. అయితే గోదావరి నుంచి నీటిని మళ్లించడం, పులిచింతల ప్రాజెక్టు పూర్తి కావడం, ఇతర నదులు, స్థానిక వాగుల నుంచి 75 టీఎంసీల నీటి లభ్యత ఉన్న నేపథ్యంలో సాగర్ నుంచి కృష్ణాడెల్టాకు నీటి విడుదల అవసరం లేదు.
- 1976లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చెన్నై తాగునీటి అవసరాలకు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లు 15 టీఎంసీలు ఇవ్వాలి. దీని ప్రకారం శ్రీశైలం నుంచి జులై, అక్టోబరు నెలల మధ్య రోజుకు 1,500 క్యూసెక్కులు విడుదల చేయాలి.
- ఉమ్మడి ఏపీ శ్రీశైలం కుడిగట్టు కాలువకు(ఎస్సార్బీసీ) 19 టీఎంసీలు పునఃకేటాయించింది. శ్రీశైలం 854 అడుగుల మట్టం నుంచి ఈ ప్రాజెక్టుకు రోజూ 750 క్యూసెక్కులు తీసుకోవాలి. వరద ఉన్నప్పుడు 4,960 క్యూసెక్కులు మళ్లించి గోరకల్లు, అవుకు రిజర్వాయర్లలో నిల్వ చేయాలి.
- శ్రీశైలంలో 880 అడుగుల మట్టంపైన వరద నీటిని తీసుకోవడానికి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను డిజైన్ చేశారు. కేంద్ర జలసంఘం ఆమోదం ప్రకారం 854 అడుగుల మట్టం నుంచి 2,250 క్యూసెక్కులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి. అయితే మిగులు జలాలు ఉపయోగించుకునే స్వేచ్ఛ ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేక ప్రాజెక్టులు చేపట్టింది.
- పక్క బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద నీటిని మళ్లించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను 6,460 క్యూసెక్కుల నుంచి 11,150 క్యూసెక్కుల సామర్థ్యానికి, తర్వాత 44వేల క్యూసెక్కులకు పెంచారు. ఈ వివరాలన్నీ బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ ముందు పెట్టి తెలంగాణకు న్యాయం చేయాలని కోరాం.
- వాస్తవానికి సాగర్ అవసరాలు తీరే వరకు ఏపీ రోజుకు 2,250 క్యూసెక్కులు(0.194 టీఎంసీ) మించి తీసుకోరాదు. అయితే తమ వాటాకు అనుగుణంగా రెండు రాష్ట్రాలు శ్రీశైలం నుంచి నీటిని తీసుకుంటున్నాయి.