folk singer sirisha : మాది తెలంగాణలోని సిరిసిల్ల. నాన్న దీకొండ అశోక్ ఆర్‌ఎంపీ డాక్టర్, అమ్మ నీరజ గృహిణి. నాకిద్దరు అన్నదమ్ములు. పల్లెలో వైద్యం అంటే తెలుసు కదా! అరకొర సంపాదనే. అయినా మాకు ఏలోటూ లేకుండా పెంచారు. నేనేం చేసినా నాన్న ప్రోత్సహిస్తూ ఉండేవారు. పాటలు సరదాగా పాడుకునేదాన్ని కానీ ఈ రంగంలోకి రావాలన్న కోరిక ఎప్పుడూ లేదు. చిన్నప్పుడు గురుకుల పాఠశాలలో చదివా. అక్కడ పాటల కోసమే ప్రత్యేకంగా తరగతులుండేవి. అయితే అది పెద్ద తరగతుల వాళ్లకే. నాకేమో అక్కడ ఏం నేర్పుతారా అన్న కుతూహలం. చాటుగా వెళ్లి వెనక కూర్చొని వినేదాన్ని. ఓసారి దొరికిపోయా కూడా. కానీ టీచర్ ఏమీ అనలేదు. ఓ పాట పాడించుకుని గొంతు బాగుందని మెచ్చుకున్నారు. ఆ ఉత్సాహంతో పాఠశాలలో జరిగే అన్ని కార్యక్రమాల్లో పాడుతుండేదాన్ని. ఆతర్వాత పాఠశాల మారా! ఇక నేర్చుకునే అవకాశమే లేదు. సినిమా పాటలు వింటూ కూనిరాగాలు తీసేదాన్ని. మా నాన్న పాడించుకుని మురిసిపోయే వారు.
ఏ అమ్మాయైనా తనకంటూ లక్ష్యం ఏర్పరచుకోవాలి. దాన్ని సాధించే క్రమంలో ఎన్నో అవరోధాలూ వస్తాయి. వాటికి భయపడితే అక్కడే ఆగిపోతాం. ధైర్యంగా ముందుకెళ్లగలగాలి. నేనూ అలాంటివెన్నో దాటుకుంటూ ఇక్కడిదాకా వచ్చా. మున్ముందూ కొనసాగిస్తా.
జానపదాల్లోకి..
మా దగ్గర దసరా సంబరాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. 2018లోనూ ఆర్కెస్ట్రాను రప్పించి పాడిస్తున్నారు. అక్కడ ఆసక్తి ఉన్నవారిని పిలిచి మరీ పాడిస్తుంటే.. మా నాన్న ‘నువ్వు బాగా పాడతావ్ కదా! వెళ్లు’ అని ముందుకు నెట్టారు. ఉత్సాహంగా వెళ్లి పాడా. అక్కడ సంగీత దర్శకుడు నవీన్ సంబారి వాళ్ల నాన్న ప్రదీప్ కూడా ఉన్నారు. ఆయనకి నా గొంతు నచ్చి మా నాన్నని సంప్రదించారు. ‘మీ అమ్మాయి బాగా పాడుతోంది. మంచి భవిష్యత్తు ఉంది మాతో పంపిస్తే శిక్షణనిస్తా’మన్నారు. నాన్న ప్రోత్సహించి పంపారు. వాళ్ల ఆర్కెస్ట్రాతో కలిసి తెలంగాణ అంతటా తిరిగి పాటలు పాడా. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల సభల్లోనూ పాడా. అలా జానపదాలు పరిచయమయ్యాయి. వాటి నుంచి ‘అత్త కొడుకా ముద్దుల మారి ఎల్లయ్య’ పాటతో గుర్తింపు వచ్చింది. దానికి 37 లక్షలకుపైగా వీక్షణలున్నాయి. దీని ద్వారానే ఓ యూట్యూబ్ ఛానెల్ కోసం ‘టిక్కు టాకు టిక్కు నీకెందుకు అంత టెక్కు’ పాడా. దీన్ని 4 కోట్ల మందికిపైగా చూశారు. దాంతోపాటే అవకాశాలూ వరుస కట్టాయి. ఇప్పటి వరకూ దాదాపు నాలుగు వందల పాటలు పాడా.
యేమే పిల్లా పాటకు 15 కోట్లకుపైగా వీక్షణలున్నాయి. బావల్ల నా బావల్ల, అత్తారింటికి కొత్తగ వోతున్న, తూర్పోడా ఓ చందురయ్య, తొలి ముద్దులు గుమ్మాడి.. ఇలా నాకు పేరు తెచ్చిన పాటలెన్నో. కొన్నింటిల్లో నటించా కూడా. అయితే డ్యాన్స్ కూడా ప్రత్యేకంగా నేర్చుకోలేదు. అయినా మెప్పిస్తున్నానంటే.. దేవుడిచ్చిన వరమనే చెబుతా. 2020లో నా పేరిట సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌నీ ప్రారంభించా. దాన్ని 7 లక్షల మందికిపైగా అనుసరిస్తున్నారు. ఓవైపు జానపద పాటలు, మరోవైపు టీవీలోనూ, బయటా కార్యక్రమాలు చేస్తూ కెరియర్ పరంగా ఆనందంగా ఉన్నా. ఎక్కడికెళ్లినా నన్నందరూ గుర్తుపడుతున్నారు. పండుగలు, ఫంక్షన్లలో నా పాటలు వింటుంటే చాలా ఆనందమేస్తుంది. ఇదంతా మా నాన్న చలవే. ఈ ప్రయాణంలో మరచిపోలేని జ్ఞాపకాలెన్నో. నా పాటలను రీల్స్ రూపంలో చాలామంది ప్రయత్నిస్తున్నారు. సినిమా వాళ్లూ చేసినప్పుడు తెలియని సంతృప్తి. సినిమాల్లో పాడే అవకాశాలూ వస్తున్నాయి కానీ నా స్థాయి పెంచేవైతే చేయాలని చూస్తున్నా. సినిమా రంగంలో రాణించాలన్నది నా కల.
ఇదీ చూడండి :బియ్యమే కాదు.. చేపలు, రొయ్యలు కూడా ఇంటి వద్దకే..