‘అవకాశాలు వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి. సద్వినియోగం చేసుకోవడానికి శాయశక్తులా కృషి చేయాలి’... అలాంటి ప్రయత్నంతోనే గంగాదేవి తనకో గుర్తింపుని తెచ్చుకోగలిగింది (telangana folk singer ganga). గంగకు చిన్నతనం నుంచే పాటలంటే మక్కువ. సాయమ్మ, మల్లయ్య దంపతుల ఇద్దరు కూతుళ్లలో గంగ చిన్నది. ఆమె పుట్టిన పది రోజులకే నాన్న ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. పసికందైన తననీ, అక్కనీ వెంటపెట్టుకొని అమ్మ తెలంగాణలోని డిచ్‌పల్లిలోని పుట్టింటికి చేరింది. వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేది. తర్వాత పిల్లలిద్దర్నీ స్థానిక పాఠశాలలో చేర్చింది. గంగ చదువుతోపాటు ఆటపాటల్లోనూ చురుకే. ఆమె ప్రతిభను గుర్తించాడో ఉపాధ్యాయుడు. స్కూల్లో ఏ ప్రత్యేక సందర్భమైనా తనతో పాడించే వారు. ఈలోగా అనుకోని అనారోగ్యం. రెండేళ్లు చదువు, పాటలకి దూరమైంది. కోలుకున్నాక అమ్మ ప్రోత్సాహంతో ప్రైవేట్‌గా పదో తరగతి రాసి ప్రథమ శ్రేణిలో పాసైంది.
అక్క చదువులో టాపర్. గంగేమో అమ్మ కష్టాన్ని చూసి చదువాపేసి ఇందిరా క్రాంతి పథకంలో కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్‌గా చేరింది. మహిళా సంఘాల సమావేశాలకి వచ్చినవారు తన గురించి తెలిసి అడిగి మరీ పాటలు పాడించుకునే వారు. ప్రభుత్వ పథకాలు, ప్రచారాలకూ పాడించే వారు. క్రమంగా జిల్లాలో ఏ కార్యక్రమం నిర్వహించినా గంగ పాట తప్పనిసరైంది. ఇలా రెండేళ్లు గడిచాయి. చదువు వైపు మనసు మళ్లి.. ఇంటర్‌లో చేరింది. ఓసారి జానపద పాటల పోటీల సెలక్షన్స్ నిజామాబాద్‌లోనే జరుగుతున్నాయని తెలిసి వాళ్ల అక్క అమ్మక్కూడా చెప్పకుండా గంగని తీసుకెళ్లింది. వీళ్లెళ్లేసరికి కార్యక్రమం పూర్తయ్యింది. ఒక్క అవకాశమివ్వమని బతిమిలాడారు ఇద్దరూ. న్యాయనిర్ణేతల్లో ఓ పెద్దాయన గంగ గొంతువిని అవకాశమిచ్చారు. నచ్చడంతో వివరాలు తీసుకుని వెళ్లిపోయారు. అప్పటికి వాళ్లకి ఫోన్ కూడా లేదు. పక్కింటివాళ్ల నంబరే ఇచ్చారు. దానికే ఆమె ఎంపికైందన్న సందేశం వచ్చింది.
అమ్మవద్దన్నా...