Family Planning Surgery Incident: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న మహిళల్లో మృతిచెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఈ నెల 25న 34 మందికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేశారు. మూడ్రోజుల తర్వాత కొందరు అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. 28న నర్సాయిపల్లికి చెందిన మమత చికిత్సపొందతూ చనిపోయారు. సోమవారం మంచాల మండలం లింగంపల్లి వాసి సుష్మ మృతిచెందారు. సీతారాంపేటకు చెందిన లావణ్య, కొలకులపల్లికి చెందిన మౌనిక చికిత్స పొందుతూ మరణించారు.
మహిళలు మృతిచెందటం కలకలం రేపటంతో వైద్యరోగ్య శాఖ అప్రమత్తమయ్యింది. ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ విచారణ చేపట్టారు. శస్త్రచికిత్సలు జరిగే గదిని పరిశీలించారు. జిల్లా వైద్యాధికారి స్వరాజ్య లక్ష్మి ఆస్పత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. ఆపరేషన్లు చేయించుకున్న మిగితా మహిళలను మళ్లీ పిలిపించి.. వారిలో ఇబ్బందులు ఉన్న కొందరిని వివిధ ఆస్పత్రులకు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో 11 మందికి, నిమ్స్‌లో 12మందికి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
ఈ ఘటనపై ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఐదుగురు నిపుణలు కమిటీని ప్రభుత్వం నియమించింది. పూర్తి విచారణ చేపట్టి నివేదిక అందించాలని ఆదేశించింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన వైద్యుడి లైసెన్స్ తాత్కాలికంగా రద్దు చేశామని శ్రీనివాసరావు తెలిపారు. ఇబ్రహీంపట్నం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం, రెండు పడకల గదుల ఇళ్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఈ విషయంపై అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా విచారణ చేపడతామని శ్రీనివాసరావు పేర్కొన్నారు.