CM KCR Speech in Adivasi and Banjara Atmiya sabha: గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీ, బంజారా భవన్‌లు వేదికలు కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి శాస్త్రీయ దృక్పథంతో మేథోమధనం జరగాలని సూచించారు. భారతజాతి ప్రతినిధులుగా గిరిజన బిడ్డలు ఎదగాలని ఆకాంక్షించిన సీఎం.. గిరిజనుల జీవనశైలి, సంప్రదాయాలను కాపాడుతున్నామని వ్యాఖ్యానించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఆదివాసీ, బంజారా ఆత్మీయ సభలో కేసీఆర్ మాట్లాడారు.
ఈ క్రమంలోనే గతంలో గిరిజనులకు 5-6 శాతం రిజర్వేషన్లు ఉండేవని గుర్తు చేసిన సీఎం.. రిజర్వేషన్లు 10 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు వెల్లడించారు. రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. రాష్ట్రపతి ఆమోదిస్తే రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఆమోదానికి బిల్లును పంపాలని ప్రధానిని కోరుతున్నానన్న కేసీఆర్.. తమకు రావాల్సిన న్యాయమైన హక్కునే కోరుతున్నామన్నారు. మోదీ.. ఆ జీవో అమలు చేస్తారా? దాన్నే ఉరితాడు చేసుకుంటారా అన్న సీఎం.. వారం రోజుల్లో 10 శాతం రిజర్వేషన్ల జీవో విడుదల చేస్తామన్నారు. 10 శాతం రిజర్వేషన్లు రాష్ట్రమే అమలు చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే త్వరలోనే గిరిజన బంధు అమలు చేస్తామన్న కేసీఆర్.. తన చేతుల మీదుగా పథకాన్ని ప్రారంభిస్తానన్నారు. భూములు లేని గిరిజనులకు పోడు భూములు పంచుతామని స్పష్టం చేశారు.
వారం రోజుల్లో 10 శాతం రిజర్వేషన్ల జీవో విడుదల చేస్తాం. మోదీ.. ఆ జీవో అమలు చేస్తారా..? దాన్నే ఉరితాడు చేసుకుంటారా..? కేంద్రానికి మొర పెట్టుకుని విసిగి వేసారిపోయాం. 10 శాతం రిజర్వేషన్లు రాష్ట్రమే అమలు చేసుకుంటుంది. గిరిజన బంధు అమలు చేస్తాం. నా చేతుల మీదుగా గిరిజన బంధు పథకం ప్రారంభిస్తా. భూములు లేని గిరిజనులకు పోడు భూములు పంచుతాం.- సీఎం కేసీఆర్