పురపాలక ఎన్నికల ఫలితాలు తెరాస నిబద్ధతకు నిదర్శనమని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తానెప్పుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని చెప్పారు.
జాతీయ పార్టీలు వ్యక్తిగత దూషణలకు దిగడం సిగ్గుచేటన్నారు. ఇకపై సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు, వ్యక్తిగత దూషణలపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.
తాను, మంత్రి కేటీఆర్ ప్రచారానికి కూడా వెళ్లలేదని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా తెరాసకు పట్టం కట్టారని తెలిపారు. రూ.80 లక్షల విలువైన ప్రచార సామగ్రి మాత్రమే పార్టీ తరఫున ఇచ్చామని, అంతకుమంచి ఒక్క పైసా పంచలేదన్నారు.
ప్రతిపక్షాలు చౌకబారు మాటలతో ప్రజల తీర్పును అగౌరపరచవద్దని సూచించారు. విపక్షాలు కూడా కొన్ని మున్సిపాలిటీలు గెలిచాయని, మరి వారెలా గెలిచారని ప్రశ్నించారు. విపక్షాలకు ప్రజలు ఇప్పటికే చాలా ఎన్నికల్లో బుద్ధి చెప్పారని, అయినా తీరు మారలేదని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి ఘనవిజయం సాధించడం చాలా అరుదని కేసీఆర్ చెప్పారు. గతేడాది 32 జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకున్నామని గుర్తు చేశారు. ఎన్నికలు ఆపేందుకు విపక్షాలు చాలా ప్రయత్నం చేశాయని, కానీ ప్రజాశ్రేయస్సు కోసం ఎన్నికలకు వెళ్లామని చెప్పారు.
పటిష్ఠమైన రెవెన్యూ చట్టం తెస్తాం...
రెవెన్యూ డిపార్టుమెంటుపై కేసీఆర్ సీరియస్ అయ్యారు. రెవెన్యూల్లో గందరగోళాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రజలు ఎందుకు పెట్రోలు డబ్బా పట్టుకుని వస్తున్నారు.... అంత చెడ్డ పేరు ఎందుకు తెచ్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు కూడా కొంత ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి పటిష్ఠమైన రెవెన్యూ చట్టం తీసుకువస్తామని తెలిపారు.
పటిష్ఠమైన రెవెన్యూ చట్టం తెస్తాం... అసెంబ్లీలో తీర్మానం చేస్తాం...
రాజ్యాంగం, చట్టం అందరికీ సమానమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తెరాస సెక్యులర్ పార్టీ అని, ఏ అంశాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెబుతామని తెలిపారు. సీఏఏ చట్టంతో దేశ ప్రతిష్ఠ అప్రతిష్ఠ పాలైందన్నారు. సీఏఏ అమలును సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకొని కొట్టివేయాలని కోరారు.
సీఏఏ అమలును సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకొని కొట్టివేయాలి బడ్జెట్ సెషన్‌లో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అసెంబ్లీకి నిర్ణయాన్ని తెలిపే అవకాశం తమకు ఉందన్నారు. భారత్ మత దేశంగా ఉండకూడదని అభిప్రాయ పడ్డారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే... నిర్ణయాలను మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఉందని కేంద్రానికి సూచించారు.