ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TRS Bhavan in Delhi: మరో కీలక ఘట్టానికి నాంది.. దిల్లీలో తెరాస భవనానికి భూమిపూజ - Trs Bhavan in Delhi news

రెండు దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర సమితిలో మరో కీలక ఘట్టానికి పునాది పడింది. దిల్లీలో తెరాస కార్యాలయ భవనానికి గులాబీ అధిపతి, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు భూమిపూజ నిర్వహించారు. దిల్లీలో పార్టీ భవనం ఓ మైలురాయిగా.. భవిష్యత్తు రాజకీయాలకు నాందిగా తెరాస శ్రేణులు అభివర్ణిస్తున్నాయి.

Trs Bhavan in Delhi
Trs Bhavan in Delhi

By

Published : Sep 2, 2021, 3:05 PM IST

దేశ రాజధాని దిల్లీలో తెరాస కార్యాలయానికి శంకుస్థాపన జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఒంటిగంట 48 నిమిషాలకు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం సీఎం కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, ఇతర నేతలు నిన్ననే దిల్లీకి చేరుకున్నారు.

గతేడాది అక్టోబరు 9న దిల్లీ వసంత విహార్ వద్ద తెరాసకు 1,100 చదరపు మీటర్ల భూమిని కేటాయించిన కేంద్రప్రభుత్వం.. గతేడాది నవంబరు 4న తెరాసకు కేంద్రం భూమిని అప్పగించింది. కొవిడ్ పరిస్థితుల కారణంగా వేచి ఉన్న తెరాస.. ఇవాళ మంచి ముహూర్తంగా భావించి భూమి పూజ చేసేందుకు ఏర్పాట్లు చేసింది.

తెలంగాణ సంస్కృతి ప్రతిబింబిచేలా...

తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా ఏడాదిలోగా పార్టీ కార్యాలయ భవన నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలు చేసింది. రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న గులాబీ పార్టీ.. దిల్లీలో పార్టీ కార్యాలయం నిర్మాణం కీలక మైలురాయిగా భావిస్తోంది. దిల్లీ కేంద్రంగా భవిష్యత్తు రాజకీయాలకు ఇది నాందిగా తెరాస శ్రేణులు అభివర్ణిస్తున్నాయి.

పార్టీ జెండా పండగ..

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా పార్టీ జెండా పండగను తెరాస శ్రేణులు ఘనంగా జరుపుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల వారీగా పార్టీ జెండా ఎగరవేస్తున్నారు. పార్టీ సంస్థాగత పునర్నిర్మాణ ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టనున్నారు. జెండా పండగ, సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్, కేటీఆర్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జెండా పండగ పూర్తి కాగానే.. గ్రామ, వార్డు కమిటీల నిర్మాణం మొదలు కానుంది. కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు 51శాతం ఉండాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మహిళలకు తగిన స్థానం కల్పించాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

C.1.2 virus: కొత్త వేరియంట్​తో​ ప్రమాదమా- శాస్త్రవేత్తల మాటేంటి?

ABOUT THE AUTHOR

...view details