ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటుంది: తెలంగాణ సీఎం కేసీఆర్​

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులపై జగన్​ ప్రభుత్వం అర్థం పర్థం లేని, నిరాధారమైన, అనవసర రాద్ధాంతం చేస్తోందని.. మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్రం కూడా తప్పుడు విధానం అవలంభిస్తోందని ధ్వజమెత్తారు. త్వరలో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో... తెలంగాణలో నిర్మిస్తోన్న ప్రాజెక్టులపై పూర్తి వాస్తవాలు, సంపూర్ణ సమాచారంతో..సమర్థ వాదనలను వినిపించాలని నిర్ణయించారు. ఏపీ సర్కార్‌కు, కేంద్రప్రభుత్వానికి గట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.

ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటుంది: తెలంగాణ సీఎం కేసీఆర్​
ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటుంది: తెలంగాణ సీఎం కేసీఆర్​

By

Published : Aug 10, 2020, 8:41 PM IST

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదులు చేయడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అపెక్స్ కౌన్సిల్ భేటీలో సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిని ఖరారు చేసేందుకు ప్రగతిభవన్‌లో.... జలవనరులశాఖ అధికారులతో సమావేశమైన కేసీఆర్‌.. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పూర్వాపరాలను పరిశీలించారు. కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభిప్రాయాలపై చర్చలు జరిపారు. రెండు రాష్ట్రాల్లో రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా... ప్రాజెక్టులు నిర్మించుకుందామని, వృథాగా పోతున్న నీటితో రైతులకు సాగునీరు అందిద్దామని... ఏపీ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి... అన్నంపెట్టి మరీ మాట్లాడితే..... ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటోందని కేసీఆర్​ వ్యాఖ్యానించారు.

నిరాధార ఆరోపణలు

తెలంగాణ ప్రాజెక్టులపై అర్థం లేని వాదనలతో, నిరాధారమైన ఆరోపణలతో ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేస్తోందని సీఎం కేసీఆర్​ ఆక్షేపించారు. అపెక్స్ కమిటీ భేటీలో ఏపీ సర్కార్‌ నోరు మూయించే విధంగా..... వారి అర్థ రహిత వాదనలను తిప్పికొడతామని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రాజెక్టులపై..... మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని కల్పించాలని.... కేసీఆర్‌ అధికారులతో చెప్పారు.

కేంద్ర వైఖరిపైనా ఆగ్రహం

తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రం వైఖరిని సైతం కేసీఆర్​ తప్పుబట్టారు. తమ రాష్ట్రానికున్న నీటి వాటా ప్రకారం... తెలంగాణ ఏర్పడే నాటికే నీటి కేటాయింపులు జరిగి, అనుమతులు పొంది, ఖర్చు కూడా చేసిన ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం... ఏమాత్రం సరికాదని అన్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు... నీటిని విడుదల చేసే విషయంలో కూడా కేంద్రం అనవసరంగా అభ్యంతరం చెబుతోందన్న కేసీఆర్‌... వాస్తవానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నింపిన తర్వాతే మిగిలిన ప్రాజెక్టులు నింపాలన్నారు.

అసలు... శ్రీశైలం ప్రాజెక్టు నీటి పారుదల ప్రాజెక్టే కాదని, అది జల విద్యుత్ ప్రాజెక్టు అని.... ఇన్ని వాస్తవాలు పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం అభ్యంతరాలు వ్యక్తంచేయడం సమంజసం కాదన్నారు. ఒక రాష్ట్రంగా తెలంగాణకు ఉన్న హక్కుల మేరకు ప్రాజెక్టులు నిర్మిస్తుంటే... రాష్ట్రాల హక్కులను హరించే విధంగా... కేంద్రం వ్యవహరించడం తగదన్నారు. కేంద్ర వైఖరిని కూడా యావత్ దేశానికి తెలిసే విధంగా చేస్తామని, అన్ని వాస్తవాలు వెల్లడిస్తామని కేసీఆర్‌ సమీక్ష తర్వాత విడుదల చేసిన ప్రకటనలో... పేర్కొన్నారు.

హక్కుల ప్రకారమే ప్రాజెక్టులు

గోదావరి, కృష్ణా బేసిన్‌లలో తెలంగాణకు ఉన్న హక్కుల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్టు సీఎం కేసీఆర్​ వెల్లడించారు. తెలంగాణ ఏర్పడే నాటికే ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్టులు మంజూరైనట్టు గుర్తుచేశారు. వాటికి... నీటి కేటాయింపులు జరిగాయని, సీడబ్ల్యూసీ సహా ఇతర సంస్థల నుంచి అనుమతులు వచ్చాయని కేసీఆర్‌ ఆ ప్రకటనలో వివరించారు. దాదాపు 23 వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి 31,500 ఎకరాల భూసేకరణ జరిగిన ప్రాజెక్టులను.. ఇప్పుడు కొత్తవని చెప్పడం అర్థ రహితం, అవివేకమని... కేసీఆర్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సమైక్యాంధ్రలోనే మంజూరైనప్పటికీ... వాటిని పూర్తి చేయలేదని, తక్కువ నీటితో ఎక్కువ ఆయకట్టును ప్రతిపాదించారని తెలిపిన కేసీఆర్‌... తెలంగాణ అవసరాలకు అనుగుణంగా వాటిని రీడిజైన్‌ చేస్తే తప్పు పట్టడంలో అర్థం లేదన్నారు.

తిరుగులేని సమాధానం చెప్పాలి

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును.... రీ-డిజైన్ చేసి కాళేశ్వరం, కంతనపల్లి ప్రాజెక్టును సమ్మక్క సాగర్.. రాజీవ్ సాగర్ -ఇందిరాసాగర్‌ను సీతారామ ప్రాజెక్టు, దుమ్ముగూడెం ప్రాజెక్టును సీతమ్మసాగర్‌ పేరుతో నిర్మిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పడమేంటని కేసీఆర్‌ ప్రశ్నించారు. ఆయా ప్రాజెక్టులకు జరిపిన భూసేకరణ, ఇతర అంశాలను అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బహిరంగ పరిచి ఫిర్యాదులు చేసిన వారికి, సందేహాలు వ్యక్తం చేసిన వారికి తిరుగులేని సమాధానం చెప్పాలని... కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి..

రాజధాని మార్పుపై ఉన్న శ్రద్ధ.. కరోనా వ్యాప్తి నివారణపై లేదు: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details