ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TELANGANA: వరంగల్‌ గ్రామీణ, అర్బన్‌ జిల్లాలకు కొత్త పేర్లు: తెలంగాణ సీఎం కేసీఆర్​ - warangal district new name

తెలంగాణ రాష్ట్రం హన్మకొండలో వరంగల్ అర్బన్ జిల్లా సమీకృత కలెక్టరేట్​ను ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రారంభించారు. వరంగల్​ వైభవం చాటిచెప్పేలా కలెక్టరేట్​ నిర్మించారని కొనియాడారు.

telangana cm kcr warangal tour
వరంగల్‌ గ్రామీణ, అర్బన్‌ జిల్లాలకు కొత్త పేర్లు: తెలంగాణ సీఎం కేసీఆర్​

By

Published : Jun 21, 2021, 5:06 PM IST

తెలంగాణలోని వరంగల్‌ అర్బన్‌, గ్రామీణ జిల్లాలకు హన్మకొండ, వరంగల్‌ జిల్లా అని పేర్లు పెడదామని సీఎం కేసీఆర్​ వెల్లడించారు. కొత్త పేర్లపై రెండుమూడ్రోజుల్లో ఉత్తర్వులు వస్తాయని తెలిపారు.

హన్మకొండలో వరంగల్ అర్బన్ జిల్లా సమీకృత కలెక్టరేట్​ను ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రారంభించారు. అన్ని హంగులు ఉన్న కలెక్టరేట్ నిర్మించినందుకు అభినందనలు తెలిపారు. వరంగల్‌ వైభవం చాటిచెప్పేలా కలెక్టరేట్ నిర్మించారని కితాబిచ్చారు. రూ.57 కోట్లతో 3 అంతస్తుల్లో సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని నిర్మాణం చేపట్టారు.

ప్రజాస్వామ్యానికి సార్థకత..

ప్రజల పనులు వేగంగా జరిగితేనే ప్రజాస్వామ్యానికి సార్థకత ఏర్పడుతుందని సీఎం అన్నారు. ప్రజలు తమ పనుల కోసం పైరవీలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండొద్దని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు మరో 4 నగరాలు అభివృద్ధి చెందాలని కేసీఆర్​ ఆకాంక్షించారు. మిగతా 30 కలెక్టరేట్‌లు కూడా త్వరగా పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.

కలెక్టర్​ పేరు ఎలా వచ్చిదంటే..

కలెక్టర్‌ హోదా పేరు కూడా మారిస్తే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు భూమి శిస్తు వసూలు చేసేవారిని కలెక్టర్‌ అంటారని కేసీఆర్​ తెలిపారు. ఇప్పుడు కలెక్టర్లకు శిస్తు వసూలు చేసే అవసరం లేదన్నారు.

వైద్య విద్యపై అధ్యయనానికి కెనడాకు..

ధరణి పోర్టల్‌పై నిత్యం అభిప్రాయ సేకరణ చేస్తున్నానని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. పాలనలో పారదర్శకత పెంచేందుకు ఎన్నో మార్పులు చేస్తున్నామని ప్రకటించారు. ప్రపంచంలో అత్యుత్తమ వైద్య విధానం కెనడాలో ఉందని తెలిసిందని... కెనడా వైద్య విధానంపై అధ్యయనానికి ఒక బృందాన్ని పంపుతామని వెల్లడించారు. కెనడాను మించిన వైద్య విధానం రాష్ట్రంలో అమలు చేస్తామని స్పష్టం చేశారు.

200 ఎకరాల్లో ఆస్పత్రి..

వరంగల్‌ జైలును కూలగొట్టడాన్ని కొందరు విమర్శిస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. జైలుతో సాధారణ పౌరులకు నిత్యం పని ఉండదన్నారు. నగరం మధ్యలో ఆస్పత్రి ఉంటే అందరికీ ఉపయోగమన్నారు. దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో వరంగల్‌ ఆస్పత్రి నిర్మాణం జరగనుందని పేర్కొన్నారు. వరంగల్‌ నగరానికి దంతవైద్యశాల, దంతవైద్య కళాశాల మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్​ వెల్లడించారు.

హైదరాబాద్‌లో జనాభా విపరీతంగా పెరిగిపోయిందన్న సీఎం.. రాష్ట్రం మొత్తం హైదరాబాద్‌పై ఆధారపడితే జిల్లాలకు నష్టమన్నారు. ఇతర జిల్లాలు కూడా అభివృద్ధి చెందితే హైదరాబాద్‌పై భారం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.

చైనా ప్రస్తావన..

చైనాలో 28 గంటల్లోనే 10 అంతస్తుల భవనం నిర్మించారని తాను పత్రికల్లో చదివానని.. ఆ చైనా తరహా నిర్మాణ పరిజ్ఞానం మనదగ్గర కూడా రావాలన్నారు. ఏడాదిన్నరలోపు వరంగల్‌ ఆస్పత్రి నిర్మాణం పూర్తి కావాలని అధికారులను సీఎం స్పష్టం చేశారు. ఎంజీఎం ఆస్పత్రిని కూడా పడగొట్టి కొత్త ఆస్పత్రి నిర్మాణం చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రి భవనాలు పాతపడినాయన్నారు.

ఇవీచూడండి:

Anandayya Medicine: ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ.. జులై 1కి వాయిదా

ABOUT THE AUTHOR

...view details