సాగునీటి కాల్వకు మరో మూడు ప్రాణాలు బలయ్యాయి. పర్వతగిరి మండలం కొంకపాక వద్ద ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వలో కారు పడిపోగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అందరూ చూస్తుండగానే నీటి ఉద్ధృతిలో కొట్టుకుపోయారు. స్థానికులు రక్షించేందుకు చేసిన ప్రయత్నాల్లో ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. మృతుల్లో ఒకరు పర్వతగిరి మండలం గుంటూర్‌పల్లిలో పనిచేస్తున్న ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయురాలిగా గుర్తించారు. తెలంగాణ వరంగల్‌కు చెందిన వినాయక ట్రేడర్స్ సిబ్బంది శ్రీధర్, విజయభాస్కర్, కారు డ్రైవర్ రాకేశ్‌తో కలిసి ప్రయాణిస్తున్నారు. సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద సరస్వతి అనే మహిళ లిఫ్ట్ అడిగారు. ఆమెతో పాటు నలుగురు ప్రయాణిస్తున్న కారు.. కొంకపాక వద్ద ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వలో పడిపోయి ప్రమాదానికి గురైంది.
కారు కాల్వలో పడిపోగానే అందులోంచి ముగ్గురు డోరు తీసుకొని చాకచక్యంగా బయటకు దిగారు. నీటి ప్రవాహ ఉద్ధృతిలోనూ కారులోంచి బయటికి రాగలిగారు. సాయం కోసం కేకలు వేశారు. వెంటనే గమనించిన స్థానికులు రంగంలోకి దిగారు. తాళ్ల సాయంతో కాపాడేందుకు యత్నించారు. నీటి ఉద్ధృతికి ఎదురీదేందుకు బాధితులు విఫలయత్నం చేశారు. నీళ్ల ప్రవాహానికి ఎదురీదలేక కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఒకర్ని స్థానికులు కాపాడగా.. మూడు మృతదేహాలను వెలికి తీశారు. కారు డ్రైవర్ రాకేశ్, శ్రీధర్, లిఫ్ట్ అడిగి వచ్చిన మహిళ సరస్వతి ప్రాణాలు కోల్పోయారని గుర్తించారు. మరో ప్రయాణికుడు విజయభాస్కర్‌ను స్థానికులు రక్షించారు.