Telangana Cabinet: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సమావేశం కానున్న రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకొనుంది. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితి సహా... కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది. కేసుల సంఖ్య పెరుగుతున్నందున.. ఈనెల 30 వరకు విద్యా సంస్థలకు సెలవులు పొడిగించిన ప్రభుత్వం.... డిజిటల్, ఆన్లైన్ తరగతుల విషయమై కేబినెట్‌లో చర్చించనుంది. వైద్య, ఆరోగ్యశాఖ సన్నద్ధతను సమీక్షించనున్న మంత్రివర్గం... వైద్యకళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంతో పాటు స్టేట్‌సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కు ఆమోదం తెలపనుంది.
ప్రాజెక్టులపై...
ధరణి పోర్టల్ అమల్లో తలెత్తుతున్న... సమస్యల పరిష్కారం కోసం ఆర్థికమంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికపైనా కేబినెట్ చర్చించనుంది. ధరణిలో మరికొన్ని మాడ్యూల్స్ అందుబాటులోకి తేవాలని సబ్‌కమిటీ చేసిన సిఫార్సులపై సమాలోచనలు చేయనుంది. ప్రాణహిత ఆనకట్టను తమ్మిడిహట్టి వద్ద కాకుండా... వార్దా నదిపై నిర్మించాలన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం... ఇవాళ్టి భేటీలో ఆ అంశమై చర్చించే అవకాశం ఉంది. మల్లన్నసాగర్- తపాస్‌పల్లి లింక్ కాల్వ, చనాకా-కొరాటా ఆనకట్ట, మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్, గట్టు, ముక్త్యాల- జన్పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లు, దేవాదుల ప్రాజెక్టులో భాగంగా.. మూడు ఎత్తిపోతల పథకాలు వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.