ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TS Cabinet Ministers: తెలంగాణ కేబినెట్​లో కీలక మార్పులు.. కొత్త మంత్రులు వీళ్లే..! - రాష్ట్ర కేబినెట్​లో కీలక మార్పులు

తెలంగాణ మంత్రివర్గం(telangana cabinet)లో త్వరలో మార్పులకు అవకాశం కనిపిస్తోంది. కొత్తగా ఇద్దరు లేదా ముగ్గురికి(telangana cabinet members) చోటు దక్కవచ్చని తెలుస్తోంది. ఈటల స్థానంలో బండా ప్రకాశ్‌(banda prakash mlc)ను కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉంది. ఇద్దరు ముగ్గురిని తప్పించి మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి(venkatram reddy ias)తో పాటు ఇతరులకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారన్నప్రచారం సాగుతోంది. మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, చీఫ్ విప్, రాజ్యసభ సీటుతో ముడిపడి పదవుల పంపిణీ జరిగే అవకాశం కనిపిస్తోంది.

TS Cabinet Ministers
TS Cabinet Ministers

By

Published : Nov 17, 2021, 9:11 AM IST

తెలంగాణలో శాసనసభ కోటా ఎమ్మెల్సీ కోటా అభ్యర్థుల ఖరారుతో ఆ రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ(telangana cabinet members)పై ఇపుడు చర్చ ప్రారంభమైంది. అనూహ్యంగా బండా ప్రకాశ్​(banda prakash mlc), మాజీ ఐఏఎస్​ అధికారి వెంకట్రామిరెడ్డి(venkatram reddy ias)కి ఎమ్మెల్యేల కోటాలో సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. బండా ప్రకాశ్​ ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 2018 ఏప్రిల్ లో ఎన్నికైన ఆయన 2024 ఏప్రిల్ వరకు ఎంపీగా కొనసాగే అవకాశం ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఎన్నిక(telangana mlc elections) కానున్నారు. వాస్తవానికి మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ భర్తరఫ్ అనంతరం బండా ప్రకాష్ ను కేబినెట్‌లోకి తీసుకుంటారన్న ప్రచారం అప్పట్లోనే సాగింది. రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షునిగా ప్రకాశ్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించడం ద్వారా ఈటల సామాజికవర్గంతో భర్తీ చేసినట్లవుతుందని అనుకున్నారు. తాజాగా బండా ప్రకాష్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంతో మంత్రి పదవి కూడా ఖాయమనే అంటున్నారు. మంత్రివర్గంలోకి తీసుకునే ఉద్దేశంతోనే రాజ్యసభ సభ్యునిగా ఉన్న ఆయనకు శాసనమండలికి ప్రాతినిధ్యం ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

వెంకట్రామిరెడ్డికి కేబినెట్​లో అవకాశం..!

కేబినెట్‌లో ఉన్న ఒక్క ఖాళీని మాత్రమే భర్తీ చేసే అవకాశం లేదని, మంత్రి పునర్వ్యవస్థీకరణ చేసి కొన్ని మార్పులు, చేర్పులు కూడా చేయవచ్చన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు సిద్దిపేట కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన వెంకట్రామిరెడ్డికి కూడా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. దీంతో ఆయనకు కూడా కేబినెట్​లో అవకాశం దక్కవచ్చన్న ప్రచారం సాగుతోంది. వివిధ స్థాయిల్లో అధికారిగా పనిచేసిన క్షేత్రస్థాయి పాలనా అనుభవం ఉండడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్​కు బాగా నమ్మకస్థుడు. సీఎం కేసీఆర్ చేపట్టే కొత్త పథకాల అమలు విషయంతో పాటు వివిధ అంశాలకు సంబంధించి వెంకట్రామిరెడ్డి నుంచి ఇన్​పుట్స్ తీసుకునే వారు. ప్రత్యేకించి భూములు, రెవెన్యూ సంబంధిత విషయాల్లో హైదరాబాద్ లో నిర్వహించే ఉన్నతస్థాయి సమావేశాలకు వెంకట్రామిరెడ్డిని కేసీఆర్ ప్రత్యేకంగా పిలిచేవారు కూడానూ. వీటన్నింటి నేపథ్యంలో ఆయణ్ను మంత్రివర్గంలోకి తీసుకొని రెవెన్యూశాఖ అప్పగించవచ్చని తెరాస వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అదే చేయాల్సి వస్తే ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది.

రాజ్యసభకు కవిత..!

మార్పులు, చేర్పులు చేయాల్సి వస్తే ఒక్కటితోనే ఆగబోదని... మరికొన్ని ఉండవచ్చన్న ప్రచారం సాగుతోంది. ప్రస్తుత రాజకీయ, పాలనాపరమైన పరిస్థితులతో పాటు రానున్న శాసనసభ, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, చీఫ్ విప్ పదవులను కూడా భర్తీ చేయాల్సి ఉంది. గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, మధుసూదనాచారి పేర్లు ఇందుకు ప్రచారంలో ఉన్నాయి. మధుసూదనాచారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించవచ్చని అంటున్నారు. అటు బండా ప్రకాష్ ఎమ్మెల్సీ అవుతుండడంతో రాజ్యసభ సీటు కూడా ఖాళీ కానుంది. ఆర్నెళ్లలోగా ఆ స్థానానికి ఎన్నిక నిర్వహిస్తారు. ఒకరికి ఆ అవకాశం దక్కుతుంది. నిజామాబాద్ స్థానికసంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత పదవీకాలం జనవరి నాలుగో తేదీతో ముగుస్తుంది. మళ్లీ మండలికి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేరన్న ప్రచారం సాగుతోంది. అదే జరిగితే కవితను రాజ్యసభకు పంపవచ్చని కూడా అంటున్నారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని త్వరలోనే మార్పులు, చేర్పులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details