వర్షాకాల సమావేశాల్లో నేటి నుంచి పూర్తి స్థాయి అజెండాపై చర్చ జరగనుంది. ఇవాళ్టి నుంచి ఉభయసభల్లో (ts monsoon assembly session) ప్రశ్నోత్తరాలనూ చేపట్టనున్నారు. తెలంగాణలోని హైదరాబాద్లో వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రాజెక్టు పనులు, మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు, ఉస్మానియా ఆస్పత్రిలో జంట టవర్ల నిర్మాణం, గొర్రెల యూనిట్ల పంపిణీ, రాష్ట్రంలో జనపనార మిల్లుల ఏర్పాటు, కొత్త జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం అంశాలు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావనకు రానున్నాయి. అక్టోబర్ 5 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ రంగం పురోగతిపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. బీఏసీ నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఉభయసభల ముందు ఉంచుతారు. గృహనిర్మాణ సంస్థ, ఉద్యానవన విశ్వవిద్యాలయం, పంచాయతీరాజ్, నల్సార్ చట్ట సవరణల బిల్లులను మంత్రులు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ నివేదికను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కొన్ని జిల్లాల్లో గ్రామపంచాయతీల మార్పులు, చేర్పుల ముసాయిదాను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఉభయ సభల ముందు ఉంచనున్నారు. శాసనమండలిలో ఇవాళ కేవలం ప్రశ్నోత్తరాలు మాత్రమే చేపడతారు. వ్యర్థాల నుంచి ఇంధన ఉత్పత్తి, రాష్ట్రంలో వరిసాగు- దిగుబడి, ఎయిడెడ్ కళాశాలల్లో కారుణ్య నియామకాలు, కొత్త కారాగారాల నిర్మాణం, స్థానికసంస్థలకు తలసరి గ్రాంటు, ఉర్దూ మాధ్యమంలో అంగన్ వాడీ కేంద్రాలకు సంబంధించిన అంశాలు కౌన్సిల్ ప్రశ్నోత్తరాల్లో చర్చకు రానున్నాయి.
బీఏసీ భేటీ సందర్భంగా కేసీఆర్ ఏమన్నారంటే..
కొత్త రాష్ట్రమైనప్పటికీ సమావేశాల నిర్వహణలో తెలంగాణ శాసనసభ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ తెలిపారు. కొత్తగా మరికొన్ని నిబంధనలు, విధివిధానాలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. శాసనసభ కుస్తీ పోటీలకు వేదిక కారాదని... అర్థవంతమైన చర్చ జరగాలన్నారు.