తెలంగాణ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు ఈనెల మూడో వారంలో జరిగే అవకాశం ఉంది. వినాయక నిమజ్జనోత్సవాల అనంతరం వీటిని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 25తో ముగిశాయి. ఆ తర్వాత ఆరు నెలలలోపు విధిగా సభ జరగాలి. వర్షాకాల సమావేశాలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. వీటిని దృష్టిలో పెట్టుకొని సెప్టెంబరు మూడో వారంలో సమావేశాలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. పదో తేదీన వినాయకచవితి కాగా.. 20న నిమజ్జనోత్సవం జరుగుతుంది. ఈ పదిరోజుల పాటు పెద్దఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాట్లు జరుగుతాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని నిమజ్జనం తర్వాత శాసనసభ, మండలి సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
మండలిలో ఏడు స్థానాలు ఖాళీ
శాసనమండలిలో ప్రస్తుతం ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎమ్మెల్యేల కోటాలో ఆరు, గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఒకటి ఉంది. వర్షాకాల సమావేశాలలోపు కౌశిక్‌రెడ్డికి గవర్నర్ నామినేటెడ్ కోటాలో నియామకం జరిగే వీలుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు శాసనసభ సమావేశాలలోపు అనుమతి లభిస్తే వెంటనే మండలి ఛైర్మన్‌ను ఎన్నుకునే వీలుంది. సమావేశాల నాటికి ఎన్నికలు జరగకపోతే ప్రొటెం ఛైర్మన్ భూపాల్‌రెడ్డి కొనసాగుతారు. వచ్చేఏడాది జనవరి 4వ తేదీకి స్థానిక సంస్థల కోటా స్థానాలు 12 ఖాళీ అవుతాయి.