తెలంగాణ శాసనసభ సమావేశాల(telangana assembly sessions 2021)ను వీలైనన్ని ఎక్కువ రోజులు జరపాలని శాసనసభ వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) నిర్ణయించింది. కరోనా అదుపులో ఉండటం వల్ల ఎక్కువ రోజులు జరపాలని సభ్యులు కోరారు. 8 పనిదినాల పాటు సమావేశాలు(telangana assembly sessions 2021) నిర్వహించాలని తెరాస ప్రభుత్వం స్పీకర్‌కు ప్రతిపాదించింది. 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ కోరింది. 12 అంశాలపై చర్చించాలని కోరిన సీఎల్బీ నేత భట్టివిక్రమార్క... అందుకు సంబంధించిన జాబితాను సంఘానికి అందజేశారు. చర్చించాల్సిన అంశాలపై అన్ని పక్షాల నుంచి జాబితా రావాలని సభాపతి తెలిపారు. జాబితా వచ్చాక పనిదినాలు నిర్ణయిద్దామని పేర్కొన్నారు. ప్రాథమికంగా మాత్రం సమావేశాలను అక్టోబర్ 5వరకు నిర్వహించాలని స్పీకర్ నిర్ణయించారు.
ఎక్కువ రోజులు జరగాలి..
మరోవైపు.. ఎక్కువ రోజులు సభ నడపాలని కోరినట్లు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క తెలిపారు. చాలా అంశాలపై చర్చ జరపాలని కోరినట్లు వెల్లడించారు. ప్రభుత్వం కొన్ని అంశాలపై చర్చ జరపాలనుకుంటోందని చెప్పిన భట్టి.. తాము అడిగినన్ని రోజులు సభ నడుపుతామన్నారని చెప్పారు.