హైదరాబాద్ ను కాపాడుకోవాలి: సీఎం కేసీఆర్ తాను జాతీయ రాజకీయాల్లోకి వస్తానేమో అని దిల్లీలో గజగజ వణుకుతున్నారంటూ... తెలంగాణ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా దిల్లీకి సందేశం ఇవ్వాలని నగర ప్రజలకు సూచించారు. "హైదరాబాద్‌లో అందరం కలిసి ఉండే పరిస్థితులు ఉండాలి... పక్క రాష్ట్రం వాడెవడో వచ్చి చెప్పే మాటలకు మోసపోవద్దు" అన్నారు. తనను కూడా పరుష పదాలతో తూలనాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఓపిక, సంయమనం, బాధ్యత ఉందనే.. తాము అలా మాట్లాడ్డం లేదన్నారు.
హైదరాబాద్‌ను కాపాడుకోవాల్సిన తరుణమిదని... రెచ్చగొట్టే మాటలతో సంయమనం కోల్పోతే.. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు లోపిస్తాయన్నారు. శాంతి లేకపోతే ఆస్తుల విలువలు పడిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను కాపాడుకునేందుకు మేధావులు, విద్యావంతులు ముందుకు రావాలని కోరారు. తెరాసకు ఓటేసి... గతం కంటే ఐదారు సీట్లు ఎక్కువ ఇచ్చి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. 'మా బాసులు దిల్లీలో లేరు... తెలంగాణ ప్రజలే మా బాసులు' అని అన్నారు.
మూసీని ప్రక్షాళన చేస్తాం: సీఎం కేసీఆర్ దురదృష్టవశాత్తూ హైదరాబాద్‌లో వరదలు వచ్చాయని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో మునిగి కన్నీళ్లు పెట్టుకున్న పేదలను చూసి బాధతో... ఇంటికి రూ.10 వేలు ఇచ్చానని తెలిపారు. వరదల సమయంలో రాష్ట్ర మంత్రులు బాధితులకు అండగా ఉన్నారని తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు రానివారు ఓట్ల కోసం వరదలా వస్తున్నారని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. బక్క కేసీఆర్ కొట్టేందుకు ఇంత మంది వస్తారా? అని తనదైన శైలిలో చురకలంటించారు. ఇవి మున్సిపల్ ఎన్నికలా..? జాతీయ ఎన్నికలా..? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మూస రాజకీయాలు పోవాలని ప్రజలకు సూచించారు.
ప్రజలు ఆలోచించాలి:సీఎం కేసీఆర్
దేశంలో చాలా నగరాల్లో వరదలు వస్తే కేంద్రం ఆదుకుంది కానీ... హైదరాబాద్‌ను మాత్రం పట్టించుకోలేదు. హైదరాబాద్ నగరం దేశంలో భాగం కాదా? ప్రధానిని రూ.1300కోట్లు అడిగితే 13 పైసలు ఇవ్వలేదు. వరద సాయం అందిస్తే కొందరు కిరికిరి పెడుతున్నారు.- సీఎం కేసీఆర్
డిసెంబర్ 7 నుంచి వరద బాధితులకు రూ.10 వేలు అందిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటికే రూ.650 కోట్ల సాయం అందించామన్న కేసీఆర్... మిగిలిన బాధితులకు సైతం డబ్బులు ఇస్తామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌ను అన్ని విధాల బాగు చేస్తామని తెలిపిన కేసీఆర్... తెరాసను గెలిపించి ఆశీర్వదించాలని కోరారు.
"అందరి క్షేమం కాంక్షించే మా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోంది. కరోనాతో ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలు ఆపలేదు. సంక్షేమ పథకాల్లో తెలంగాణకు సాటి ఎవరూ లేరు. గాలివాటంగా ఓటు వేయొద్దనే మా పథకాలు ప్రజల ముందుంచాం. మా ప్రభుత్వం వచ్చాకే హైదరాబాద్‌కు సౌకర్యాలు కల్పించాం. వరద బాధల నుంచి హైదరాబాద్‌కు శాశ్వత విముక్తి కల్పిస్తాం. వరద కష్టాల విముక్తికి ఏటా రూ.10 వేల కోట్లు కేటాయిస్తాం. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు విస్తరిస్తాం. ఎలక్ట్రిక్ వాహనాలతో హైదరాబాద్‌లో కాలుష్యం తగ్గిస్తాం. మూసీ నదిని గోదావరితో అనుసంధానిస్తాం. ప్రతి రైతు కుటుంబానికి రూ.5 లక్షల రైతుబీమా అమలు చేస్తున్నాం. ప్రతి యాదవ కుటుంబానికి గొర్రెలు అందిస్తాం. యావత్ నగర ప్రజల కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరికీ రైతుబంధు ఇస్తున్న ప్రభుత్వం మీ ముందుంది. కేసీఆర్ కిట్ సూపర్ హిట్." -సీఎం కేసీఆర్
ఇదీ చూడండి: