TEACHERS DAY BOYCOTT : రాష్ట్ర ప్రభుత్వం, ఉపాధ్యాయుల మధ్య అనేక విషయాల్లో నెలకొన్న సంఘర్షణకు ఇప్పట్లో తెరపడేలా లేదు. సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డ ఉపాధ్యాయులు ఉద్యోగులతో కలిసి ఈ నెల ఒకటిన చలో విజయవాడ, సీఎం నివాసం ముట్టడికి పిలుపిచ్చారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. ఎక్కడిక్కడ అరెస్టులు, నిర్బంధాలు, ముందస్తు నోటీసుల పేరుతో కట్టడి చేసింది. చేసేది లేక నిరసన కార్యక్రమాలను ఉద్యోగులు వాయిదా వేసుకున్నారు.
ఈ సందర్భంగా కేసులు పెట్టడంతో పాటు పాఠశాలల్లోనే నోటీసులు ఇవ్వడంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ముఖ ఆధారిత యాప్‌లోనే హాజరు నమోదు చేయాలని.. లేకపోతే విధులకు గైర్హాజరైనట్లు పరిగణిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మంత్రి బొత్స సత్యనారాయణతో జరిపిన చర్చల తర్వాత ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాలు కూడా ఉపాధ్యాయులకు ఆగ్రహం తెప్పించాయి. అందుకే గురుపూజోత్సవం బహిష్కరించాలని వారు నిర్ణయించారు.