FACE CAPTURING: కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయుల హాజరు కష్టాలు వర్ణణాతీతం.. ఫేస్ రికగ్నైజేషన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని.. 9గంటల్లోపు ఫోటోలు అప్‌లోడ్ చేస్తేనే హాజరు పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధానం అమల్లోకి తెచ్చిన తొలిరోజు ఇదిగో ఇలా ఉపాధ్యాయులు అష్టకష్టాలు పడ్డారు. ఈ పాఠశాలలో.. మొత్తం 24 మంది ఉపాధ్యాయులు, ఆరుగురు బోధనేతర సిబ్బంది ఉన్నారు. ఉదయం 9 గంటలలోపు.. కేవలం ఇద్దరికే హాజరు ప్రక్రియ పూర్తైంది. మిగతా వారంతా ఇదిగో ఇలా పాఠశాల ఆవరణలో.. అగచాట్లు పడ్డారు. పట్టువదలని విక్రమార్కుల్లా.. ఆ యాప్‌తో కుస్తీపట్టారు. చివరకు నిస్సహాయంగా క్లాసుల్లోకి వెళ్లిపోయారు.
ఇక ఇద్దరు టీచర్ల మధ్య జరిగిన సంభాషణ ఆసక్తి రేపుతోంది. ఎంతసేపటికీ యాప్‌లో హాజరు నమోదుకాకపోవడంతో సెటైర్లు వేసుకున్నారు. రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌తో విసిగిపోయారు. చాలామందికి కనీసం అవగాహనే లేదు. సీఎం సొంత జిల్లా.. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో.. మొత్తం 38 మంది ఉపాధ్యాయులు ఉండగా మధ్యాహ్నం 12 గంటల వరకూ కేవలం పదిమంది హాజరు మాత్రమే అప్‌లోడ్ అయింది. మిగతా వారికి నాట్ సక్సెస్ అని వచ్చింది.