ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా పాఠశాల విద్యా శాఖ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ నిర్వహించింది. పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య నమోదుకు ఈనెల 4వరకు గడువు ఇవ్వగా.. కొన్నిచోట్ల 3వ తేదీ వరకు ఉన్న వివరాలనే పరిగణలోకి తీసుకున్నారు. అయితే పోస్టులను కాపాడుకునేందుకు పలుచోట్ల అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఇంకొన్ని చోట్ల ఏకంగా పోస్టులే గల్లంతయ్యాయి.
ఆంగ్లం, తెలుగు మాధ్యమాలు ఉన్నచోట విద్యార్థుల సంఖ్యను తెలుగు మాధ్యమంలోనే నమోదు చేయడంతో ఆంగ్ల మాధ్యమ పోస్టులు లేకుండాపోయాయి.హేతుబద్దీకరణలో చోటుచేసుకున్న తప్పుల కారణంగా పోస్టుల ఖాళీల్లోనూ స్పష్టత లోపించింది.
గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని లాం గ్రామంలో పాటిబండ్ల సీతారామయ్య మండల పరిషత్తు పాఠశాలలో ఉన్న 14మంది విద్యార్థులను వేరే బడుల్లో చదువుతున్నట్లు చూపి, రెండు పాఠశాలల్లో పోస్టులను అక్రమంగా దక్కించుకున్నారు. 12మంది విద్యార్థులను తాతిరెడ్డిపాలెం పాఠశాలలో ఉన్నట్లు చూపడంతో హేతుబద్దీకరణలో ఉపాధ్యాయ పోస్టు పోకుండా మిగిలింది. మరో ఇద్దర్ని ఫణిదరం బడిలో చదువుతున్నట్లు చూపి, ఇక్కడ మరో పోస్టును అదనంగా పొందారు. ఇలా చేయడం వల్ల లాం గ్రామంలో బడికి అదనంగా రావాల్సిన పోస్టులు రాకుండాపోయాయి.
ఈనెల మూడో తేదీ వరకు లేని విద్యార్థులను చూపించిన ఉపాధ్యాయులు ఆ తర్వాత ఈనెల 9న వీరికి టీసీలు ఇచ్చినట్లు ఆన్‌లైన్‌లో చూపారు. తమ పోస్టులను కాపాడుకున్న వెంటనే వారికి టీసీలు ఇచ్చి, పంపించినట్లు చూపారు. దీనిపై డిప్యూటీ విద్యాధికారిని విచారణకు ఆదేశించినా ఇంతవరకు నివేదిక సమర్పించలేదు. కొందరు అధికారులు డబ్బులకు కుక్కురిపడి చైల్డ్ ఇన్పోను మార్చేశారు.