విద్యార్థుల హాజరును మొదట రిజిస్టర్‌లో తీసుకున్న తర్వాత దాన్ని యాప్‌లో నమోదు చేస్తున్నారు. అంతర్జాల సదుపాయం బాగున్నచోట తొందరగా పూర్తవుతుండగా.. నెట్‌వర్క్ లేనిచోట 45 నిమిషాల వరకు సమయం పడుతోంది. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే దీనికి అదనం. బడిలో ఒకే పేరుతో నలుగురైదుగురు ఉంటే వీరికి హాజరు వేయడం మరింత కష్టంగా మారుతోంది. యాప్‌లో ఇంటిపేర్లు లేకపోవడంతో పిల్లల ఐడీ నంబరును దగ్గర పెట్టుకోవాల్సిన పరిస్థితి. కొందరు విద్యార్థులకు ఒకే పేరుంటే మరింత కష్టంగా మారుతోంది. ఉన్నత పాఠశాలల్లో ఈ బాధ్యతలను ప్రత్యేకంగా ఒక ఉపాధ్యాయుడికి అప్పగిస్తున్నారు. దీంతో మొదటి పీరియడ్ బోధనకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
* రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 10వేలకు పైగా ఉన్నాయి. ఇలాంటిచోట రెండుసార్లు హాజరుకు సమయం కేటాయిస్తే పాఠాల బోధనకు అంతరాయం ఏర్పడుతోంది. విద్యార్థులు ఒక బడి నుంచి మరో బడికి మారినప్పుడు ఆన్‌లైన్‌లో టీసీల మార్పు జరగడం లేదు. కొత్తగా చేరిన బడిలో విద్యార్థుల హాజరు నమోదు కావడం లేదు. వీరంతా అనధికారికంగానే కొనసాగుతున్నారు.
మరుగుదొడ్ల చిత్రాలు
ఉపాధ్యాయులు ప్రతిరోజూ మరుగుదొడ్ల శుభ్రతకు సంబంధించి 4-8 చిత్రాలు తీయాల్సి వస్తోంది. నెల్లూరు జిల్లాలో కొన్నిచోట్ల స్థానిక రాజకీయ కారణాలతో పారిశుద్ధ్య కార్మికుల నియామకాలు జరగలేదు. అలాంటిచోట ఉపాధ్యాయులే మురుగుదొడ్లను శుభ్రం చేసి, ఫొటోలు తీస్తున్నారు. మరుగుదొడ్లు, చేతులు కడుక్కునే బేసిన్లు, ఫ్లోర్... బాలురు, బాలికలకు విడివిడిగా తీసి అప్‌లోడ్ చేయాల్సి వస్తోంది. ఒక ఫొటో తీసి, అప్‌లోడ్ చేసేలోపు నెట్‌వర్క్ పోతే మళ్లీ ఫొటో తీయాల్సి వస్తోంది. ఈ ఫొటోలు తీసి పంపించేందుకు 20-30 నిమిషాలు పడుతోంది. నెట్‌వర్క్‌లేని బడుల్లో మొదట ఒక చిత్రాన్ని తీసి, సిగ్నల్స్ వచ్చేచోటకు వెళ్లి అప్‌లోడ్ చేసి, మళ్లీ వచ్చి ఇంకో ఫొటో తీస్తున్నారు.