PDF MLC's on Merger of Schools: పాఠశాలల విలీనం మాటలకు అందని విషాదమని, ప్రాథమిక విద్యలో ఒక విధ్వంసమని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, శ్రీనివాసులరెడ్డి, షేక్ సాబ్జీ విమర్శించారు. విలీనాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహించిన ‘బడి కోసం బస్సు యాత్ర’ వివరాలను విజయవాడలో శనివారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
పాఠశాలల విలీనం ప్రాథమిక విద్యలో ఒక విధ్వంసమన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు - ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు
Merger of schools పాఠశాలల విలీనం ఊహకందని పెనువిషాదమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఆవేదన వ్యక్తం చేశారు. జూలై 25 నుంచి 31 వరకూ ఎమ్మెల్సీలు బడి కోసం బస్సు యాత్ర చేపట్టారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నుంచి వచ్చిన అభ్యంతరాలు, పరిష్కారాలతో వారు నివేదిక రూపొందించారు. పాఠశాలల విలీనానికి రాజకీయ ఒత్తిళ్లు తప్ప శాస్త్రీయత లేదని ఆక్షేపించారు.
‘పేదవారు ఎంతో ప్రాధాన్యంగా చూసుకుంటున్న బడి దూరంగా వెళ్లిపోతోంది. సారా ఉద్యమ సమయంలో పోరాడినట్లు పేద మహిళలు ఇప్పుడు బడిని కాపాడుకునేందుకు పోరాడుతున్నారు. బడి దూరమవడంతో పిల్లల్ని రోజూ తీసుకువెళ్లి, తీసుకురాలేమని చెబుతున్నారు. విలీనంపై తల్లిదండ్రుల కమిటీలతో చర్చించకుండా, ఏకపక్షంగా చేసేశారు. ఉపాధ్యాయులను ప్రాథమిక బడుల నుంచి ఉన్నత పాఠశాలలకు పంపించి వేశారు. మధ్యాహ్న భోజనం పెట్టడం నిలిపివేశారు. ఒక్కసారిగా 2.50 లక్షల మంది విద్యార్థులను తరలించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పెద్ద ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు స్థానికులను తరలించినట్లు విద్యార్థులను తరలించేశారు. పిల్లల వైపు నుంచి నిర్ణయమని చెబుతున్న విద్యాశాఖ వారి హక్కులను ఎందుకు పట్టించుకోలేదు? ప్రాథమిక బడి కకావికలమై.. ప్రవేశాలు తగ్గిపోయాయి. 3, 4, 5 తరగతులను తరలించడంతో నెల్లూరు జిల్లా జెండా దిబ్బలో విద్యార్థులు అటు హైస్కూల్‌కు, ఇటు ప్రాథమిక పాఠశాలకు వెళ్లకుండా ఉండిపోయారు. చాలా చోట్ల పిల్లలు ప్రైవేటుకు వెళ్లిపోయారు. వీరంతా కరోనా నేపథ్యంలో సర్కారు బడుల్లో చేరి.. తిరిగి ప్రైవేటుకు వెళ్లిపోయినవారు కాదు. విలీన విధ్వంసం వల్ల వెళ్లిపోయారు. ఉన్నత పాఠశాలల్లో చేరినవారు అక్కడ ఉండలేక వెనక్కి వచ్చేశారు. ఎక్కువ మంది విద్యార్థులున్న ప్రాథమిక బడులను ముక్కలు చేశారు. విద్యార్థులు తగ్గిపోవడంతో 1, 2 తరగతులే ఉండే బడులు మూతపడే దశకు వచ్చేశాయి. ఈ బడులు ఉంటాయో లేదో తెలియక ఒకటో తరగతిలో చాలా మంది చేరలేదు. ఇదే విధానం కొనసాగితే 80 శాతం బడులు మూతపడతాయి. 1, 2 తరగతుల పాఠశాలల్లో అంగన్‌వాడీలను విలీనం చేసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో 1,2 తరగతుల బడుల నిర్వహణ ప్రశ్నార్థకమైంది’ -విఠపు బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, శ్రీనివాసులరెడ్డి, షేక్ సాబ్జీ, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) ఎమ్మెల్సీలు
ఇవీ చదవండి: