APPS పాఠశాలల్లో బోధన కంటే బోధనేతర పనులపైనే ఉపాధ్యాయులు ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది. విద్యా శాఖ ప్రవేశపెట్టిన వివిధ యాప్‌ల్లో వివరాలు నమోదు చేయడానికి తంటాలు పడుతున్నారు. పిల్లలకు బోధించడానికి ఎనిమిది పిరియడ్లు ఉంటే..ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నిర్వహించాల్సిన యాప్‌లు దాదాపు 13 వరకు ఉంటున్నాయి. వీటిని నిర్వహించడానికే రోజులో రెండు, మూడు గంటలు సమయం పడుతోందని గురువులు గగ్గోలు పెడుతున్నారు. వీటికి తోడు ఇప్పుడు ముఖ ఆధారిత హాజరు విధానానికి మరో యాప్‌ను తీసుకురావడంతో ఉపాధ్యాయ లోకం ఆందోళన చెందుతోంది. ఇప్పటికే ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు సెల్ఫీ హాజరును విరమించుకోవాలని వినతి పత్రాలు ఇచ్చారు. యాప్‌లతోనే కూర్చుంటే బోధన సాగించేదెప్పుడని ప్రశ్నిస్తున్నారు.
పాఠశాల స్థాయిలో నిర్వహించే యాప్‌లు ఇవే..
గురువులు వినియోగించాల్సిన యాప్‌లు ఇవే..
ఐఎంఎంఎస్ యాప్: ఇందులో వంటగది ప్రదేశం, సరకులు నిల్వచోటు, వండే పాత్రలు, చెత్త డబ్బా, విద్యార్థులు తినే ప్రదేశం, మంచినీటి సదుపాయం, చేతుల శుభ్రత, కోడిగుడ్లు, మరుగుదొడ్ల నిర్వహణకు సంబంధించి ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి.
జేవీకే యాప్: జగనన్న విద్యాకానుక రూపంలో ఎనిమిది రకాల విద్యా సామగ్రిని పిల్లలకు ఇస్తున్నారు. అవి అందినట్లు పిల్లల తల్లిదండ్రులతో బయోమెట్రిక్ తీసుకోవాలి.
అకడమిక్ మోనిటరింగ్ యాప్: పాఠశాలను విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఇతర శాఖల అధికారులు పరిశీలించడానికి వచ్చినప్పుడు వారి పరిశీలనా వివరాలను ఇందులో నమోదు చేయాలి.
ఏపీ టెల్స్ యాప్ : ఉపాధ్యాయులు సెలవులు తీసుకోవాల్సి వస్తే ముందుగా ఈ యాప్‌లో వివరాలు నమోదు చేసి ప్రధానోపాధ్యాయుని అనుమతి తీసుకోవాలి.
బేస్‌లైన్ టెస్ట్ యాప్: విద్యార్థులకు నిర్వహించే పరీక్షల వివరాలు, వారి మార్కులన్నీ ఈ యాప్‌లో నమోదు చేయాలి.
మంత్ర ఆర్డీ యాప్: ఉపాధ్యాయులు పాఠశాలలకు రాగానే బయోమెట్రిక్ వేయాలి. జేవీకే గురించి తల్లిదండ్రుల అథంటికేషన్ తీసుకోవాలి. వీటికోసం డివైస్‌లు ఉపయోగించాలి. ఆ డివైస్ పనిచేయాలంటే ఈ యాప్ చరవాణిలో డౌన్‌లోడ్ చేసుకుని ఉండాలి.
మనబడి నాడు-నేడు యాప్: నాడు-నేడు పనులు జరుగుతున్న పాఠశాలల్లో ఈ యాప్‌ను వినియోగిస్తారు. పనులు ఏ దశలో ఉన్నాయి.. సిమెంట్, ఐరన్, ఇసుక నిల్వలు, బిల్లుల చెల్లింపులు వంటి వివరాలు అందులో నమోదు చేయాలి.