'ఉద్యమం ఆపేందుకు జగన్ వదిలిన బాణం... ఎంపీ నందిగం సురేష్' - వర్ల రామయ్య తాజా న్యూస్
మహిళా జేఏసీ నేతలపై ఎంపీ నందిగం సురేష్ వ్యవహరించిన తీరు దారుణమని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. వారికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతి ఉద్యమం ఆపేందుకు జగన్ వదిలిన బాణం... నందిగం సురేష్ అని ఆయన ఆరోపించారు.
వైకాపా ఎంపీ నందిగం సురేష్ తన పదవి శాశ్వతం అనుకుంటున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య విమర్శించారు. ఉద్యమం ఆపేందుకు జగన్ వదిలిన బాణం నందిగం సురేశ్ అని ఆయన ఆరోపించారు. ఉద్యమం చేస్తోన్న వారిని రెచ్చగొట్టేలా ఎంపీ వ్యవహారశైలి ఉందని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగం సురేష్ అవినీతికి సంబంధించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ముఖ్యమంత్రి దగ్గర ఉందని... అందుకే జగన్ ఆడించినట్లు ఎంపీ ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. మహిళా జేఏసీ నేతలపై ఎంపీ వ్యవహరించిన తీరు దారుణమని, మహిళలను నోటికొచ్చినట్టు తిట్టారని మండిపడ్డారు. మహిళలకు ఇబ్బంది వస్తే జగనన్న వస్తారని చెప్పిన రోజా... ఈ ఘటనకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. మహిళలకు ఎంపీ నందిగం సురేష్ క్షమాపణ చెప్పాలని వర్లరామయ్య డిమాండ్ చేశారు.