వైకాపా అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో 16 శాతం ఓటింగ్‌కు దూరం అయ్యిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. దాడులు, దౌర్జన్యాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు వైకాపాకు దూరం అయ్యారని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు చేయాలన్న రైతులపై కేసులు పెట్టడం వైకాపా నేతల రాక్షసత్వమని చంద్రబాబు ధ్వజమెత్తారు. నరసరావుపేట పార్లమెంట్ నాయకులతో చంద్రబాబు ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. రైతులపై తప్పుడు కేసులు పెట్టిన ప్రభుత్వం దేశంలో మరేదీ లేదని విమర్శించారు. 16 నెలల వైకాపా అవినీతి కుంభకోణాలపై కూడా సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ భూముల్లో వైకాపా వన్ సైడ్ ట్రేడింగ్, నాసిరకం మద్యం బ్రాండ్లపై సీబీఐ దర్యాప్తు చేయాలన్నారు.
ఎన్నడూ లేని దాడులు
దేవాలయాలపై ఇన్ని దాడులు గతంలో ఎన్నడూ లేవన్న చంద్రబాబు... మనుషులకే కాదు, దేవుళ్లకూ వైకాపా పాలనలో రక్షణ లేదని విమర్శించారు. ఆలయాలపై వరుస దాడులు చూస్తుంటే రాక్షస కాలం గుర్తొస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాక్షసుల కాలంలో కూడా ఇన్ని ఆగడాలు లేవని తెలిపారు. కుల, మత విద్వేషాలు రాష్ట్రంలో గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని చంద్రబాబు ప్రశ్నించారు.