పలు జిల్లాల్లోని తెదేపా నాయకులు, కార్యకర్తలు.. ధర్మ పరిరక్షణ దీక్షలు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నా సీఎం జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆలయాలపై దాడులను అరికట్టాలని నినాదాలు చేశారు.
కృష్ణా జిల్లాలో...
కృష్ణాజిల్లా మైలవరంలో నూజివీడు రోడ్డులోని మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాల వద్ద.. మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టారు. ఆలయాలపై జరుగుతున్న దాడులు.. మతసామరస్యానికి తూట్లు పొడుస్తూ, హిందువుల మనోభావాలని దెబ్బతీస్తున్నా సీఎం జగన్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థల్ని లెక్కచేయకుండా అధికారముందనే అహంకారంతో వ్యవహరిస్తున్నారన్నారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో పరాభవం తప్పదని హెచ్చరించారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న టీఎన్ఎస్ఎఫ్ నాయకుల్ని అక్రమంగా నిర్బంధించడాన్ని ఖండించారు.
ప్రజాస్వామ్య విరుద్ధమైన పాలన విడిచిపెట్టి రాష్ట్ర అభివృధి కోసం చర్యలు చేపట్టకుంటే.. వైకాపా ప్రభుత్వం తగు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారయణరావు హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అధర్మపాలన, కక్షపూరిత చర్యలను నిరసిస్తూ.. మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయం వద్ద వారు ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టారు. తాము అధికారంలో ఉన్నప్పుడు న్యాయబద్ధంగా వ్యవహరించాము కాబట్టే యాత్రల పేరుతో జగన్ రాష్ట్రమంతా తిరగారని అన్నారు. కుట్రపూరిత రాజకీయాలతో తెదేపా శ్రేణులను అకారణంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.
విశాఖ జిల్లాలో...
చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు విశాఖ జిల్లా తగరపువలసలో.. పార్టీ శ్రేణులు హిందూ ధర్మ పరిరక్షణ దీక్ష నిర్వహించారు. రాజ్యాంగ విలువల్ని కాపాడాలంటూ.. అంబేడ్కర్ విగ్రహానికి తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోరాడ రాజబాబు, రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు వినతిపత్రం అందజేశారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని నినదించారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ విధానాలను విమర్శించారు. రాజ్యాంగేతర శక్తులను సమాజానికి దూరం చేయాలన్నారు.