మూడు రాజధానులపై వైకాపా తీసుకున్న నిర్ణయం సరైనదైతే వెంటనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ సవాల్ విసిరారు. అభివృద్ధి కోసమే పాలనా వికేంద్రీకరణ అంటున్న సీఎం జగన్ ప్రజాభిప్రాయం తీసుకుందామంటే ఎందుకు వెనకాడుతున్నారో చెప్పాలన్నారు. జగన్ అమరావతిపై మాట తప్పి ప్రజల్ని మోసం చేసినందుకు ఎప్పుడు రాజీనామా చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు.
రాజధాని అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతిచ్చి ఇప్పుడు విశాఖలో కబ్జా చేసిన భూముల కోసం మూడు రాజధానులు అంటున్నారని కళా ధ్వజమెత్తారు. ఇవేనా ఆయన చెప్పిన రాజకీయ విలువలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంతృత్వ వైఖరితో తీసుకున్న నిర్ణయంపై ప్రజా వ్యతిరేకతను తట్టుకేలేకే.. సీఎం ప్రజలకు ముఖం చాటేస్తున్నారని మండిపడ్డారు. తెదేపా అధినేత చంద్రబాబు సవాల్‌ను స్వీకరించి.. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రజలు మళ్లీ వైకాపాకు అధికారం ఇస్తే తాము మాట్లాడమని.. లేని పక్షంలో న్యాయపోరాటం కొనసాగుతుందని కళా వెంకట్రావు స్పష్టం చేశారు.