తెదేపా అధికారంలోకి వస్తే నాడు-నేడు పనులపైనే తొలి విచారణ జరిపిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్రలో మాట్లాడిన ఆయన... నాడు-నేడు పనుల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. గోడలకు చెక్క సున్నాలు అతికించి పెద్ద ఎత్తున డబ్బులు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.
తుపాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని అచ్చెన్న విమర్శించారు. నష్టపరిహారం చెల్లించకుండా వాయిదాలు వేస్తున్నారని అన్నారు. గత ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో 600మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పంట బీమా ఆగస్టు నెలలో చెల్లించాల్సి ఉన్నా... డిసెంబర్ వరకు ప్రభుత్వం కట్టలేదని దుయ్యబట్టారు. ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ అవినీతికి చిరునామా అని ఆరోపించారు. వైకాపా నేతలకు డబ్బులిచ్చిన వారి పేర్లు మాత్రమే అర్హుల జాబితాలో ఉన్నాయని చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియకుండా జాబితాను రూపొందించటం సరికాదని వ్యాఖ్యానించారు.