రాష్ట్రంలో ఏ మూల చూసినా ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగిపోయాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఎస్సీ ప్రాతినిథ్య నియోజకవర్గాలలో సైతం వైకాపా నాయకులు ఎస్సీలపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నందికొట్కూరులో తెదేపా ఎస్సీ నేత శాంతరాజుపై దాడిచేసి కేసు నమోదు చేయడం దుర్మార్గమని ఖండించారు. భూ వివాదం పరిష్కరించాలని అడగటం శాంతరాజు చేసిన తప్పా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. శాంతరాజు అక్రమ అరెస్టుపై నిరసన తెలపడానికి వచ్చిన దళిత సంఘాలను సైతం బెదిరించే స్థాయికి వైకాపా నేతలు తెగబడ్డారని దుయ్యబట్టారు. దళితులు మంత్రులుగా ఉండి కూడా న్యాయం చేయలేని స్థితిలో ఉండడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నానన్నారు. అంబేడ్కర్ రిజర్వేషన్ ఫలాలతో పదవులు చేపట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు సాటి కులస్తులపై దాడులు చేస్తుంటే మాట్లాడలేని పరిస్థితి వైకాపా నేతలదని మండిపడ్డారు. జగన్ రెడ్డికి భయపడే మంత్రులు దళితులపై మాత్రం తమ ప్రతాపం చూపడం సిగ్గుచేటన్నారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి వారిపైనే దాడులు చేస్తున్న వైకాపా నాయకులకు దళితులే బుద్ది చెప్పేరోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. దళితులపై దాడి చేస్తే తెలుగుదేశం పార్టీ చూస్తూ కూర్చోదని హెచ్చరించారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందని మాట్లాడుతున్న వైకాపా నాయకులు ఆ థియరీ తమకు వర్తిస్తుందని గుర్తించుకోవాలని అచ్చెన్నాయుడు హితవు పలికారు.
ACHENNAIDU: ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగిపోయాయి: అచ్చెన్నాయుడు - అచ్చెన్నాయుడు వార్తలు
వైకాపా ప్రభుత్వంపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఎస్సీలకు రక్షణ లేకుండా పోయిందని.. ఏమూల చూసిన వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయని మండిపడ్డారు.
TDP STATE PRESIDENT ACHENNAIDU FIRE ON CM JAGAN ABOUT ATTACK ON SC S