Darapaneni Narendra: సామాజిక మాధ్యమాల్లో పోస్టుల వ్యవహారంపై సీఐడీ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తెలుగుదేశం మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్రను.. బుధవారం రాత్రి సీఐడీ అరెస్ట్ చేసింది. జర్నలిస్ట్ అంకబాబు గతంలో షేర్ చేసిన పోస్టుని నరేంద్ర మరికొందరికి షేర్ చేసినట్లు అభియోగాలు మోపింది. నరేంద్ర అరెస్ట్‌పై తెలుగుదేశం అధినేత చంద్రబాబు సహా పలువురు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గుంటూరు సీఐడీ కార్యాలయం ఆందోళనకు దిగిన సీనియర్ నేతలు, శ్రేణులను అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది.
సీఐడీ అదుపులో దారపనేని నరేంద్ర.. ఖండించిన చంద్రబాబు - ఏపీ సీఐడీ వార్తలు
21:30 October 12
నరేంద్ర అరెస్ట్‌ను ఖండించిన చంద్రబాబు
తెలుగుదేశం కేంద్ర కార్యాలయ మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్రను.. బుధవారం రాత్రి సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు గుంటూరు అరండల్‌పేట యాగంటి అపార్ట్‌మెంట్స్‌లోని నివాసానికి చేరుకున్న సీఐడీ అధికారులు.. రెండు గంటలపాటు నరేంద్రను ప్రశ్నించారు. అనంతరం ఆయన్ని అరెస్ట్ చేసి.. గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. అరెస్టుకు ముందు నరేంద్రకు సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. ఆయన భార్య సౌభాగ్యలక్ష్మికి అరెస్ట్ విషయం చెప్పి నరేంద్రను తీసుకెళ్లారు. ఆయనపై 153A, 505, 120B సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇవాళ గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత.. సీఐడీ కోర్టులో నరేంద్రను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
గన్నవరం విమానాశ్రయంలో పట్టుబడిన బంగారం వ్యవహారంపై.. సీనియర్ పాత్రికేయుడు కొల్లు అంకబాబు గతంలో ఓ పోస్టును షేర్ చేశారు. దాన్ని నరేంద్ర కూడా షేర్ చేశారంటూ సీఐడీ అధికారులు అభియోగాలు మోపారు. రెండు రోజుల క్రితం విజయవాడకు చెందిన ఓ వైద్యుడిని సీఐడీ అధికారులు విచారించారు. బంగారం పట్టుబడిన వ్యవహారంపై నరేంద్ర నుంచి పోస్టు వచ్చినట్లు విచారణలో ఆయన వెల్లడించారు. ఆ మేరకు కేసు నమోదు చేసి నరేంద్రను అరెస్ట్ చేశారు. తన భర్త చేసిన తప్పేంటో చెప్పకుండా బలవంతంగా తీసుకెళ్లారని నరేంద్ర భార్య ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతన్నారు.
దారపనేని నరేంద్ర అరెస్టుని ఖండిస్తూ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు.. గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. సీఐడీ అధికారులు, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు యత్నించడంతో వాగ్వాదం జరిగింది. అనంతరం నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తోపాటు ఇతర నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నరేంద్ర అరెస్టు చెల్లదని న్యాయవాది కోటేశ్వరరావు అన్నారు. గతంలో సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో జరిగిందే పునరావృతమవుతుందని తేల్చిచెప్పారు.
దారపనేని నరేంద్ర అరెస్టును తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. న్యాయస్థానాలు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా సీఐడీ అధికారుల తీరు మారడం లేదని ఆక్షేపించారు. అక్రమంగా వ్యవహరిస్తున్న పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. నరేంద్ర కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇవీ చదవండి: