రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదివేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు కేంద్ర సౌర విద్యుత్ సంస్థ (సెకి)తో ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక భారీ కుంభకోణం ఉందని తెదేపా సీనియర్ నేత, ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... అది రైతుల కోసం అమలు చేస్తున్న స్కీం కాదని... అదానీకి రూ.వేల కోట్లు దోచిపెట్టేందుకు చేస్తున్న స్కామ్ అని మండిపడ్డారు. ‘‘సెకి 2020 నవంబరు, డిసెంబరు నెలల్లో సౌర విద్యుత్ ప్లాంట్‌ల ఏర్పాటుకి టెండర్లు పిలిస్తే... యూనిట్ విద్యుత్ రూ.2కి, గుజరాత్ ప్రభుత్వం పిలిచిన టెండర్లలో యూనిట్ రూ.1.99కే తక్కువ ధరకు బిడ్లు దాఖలయ్యాయి. అదే సెకితో రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ రూ.2.49కి కొనేందుకు ఒప్పందం చేసుకుంది. పైగా దేశంలోనే అతి తక్కువ ధరకు విద్యుత్ కొన్నామని, దానితో రాష్ట్రానికి లాభమేనని ప్రజల్ని మోసగిస్తోంది...’’ అని కేశవ్ ధ్వజమెత్తారు. ఒక పక్క యూనిట్ రూ.1.99కే వస్తుంటే... ప్రభుత్వం రూ.2.49కి కొనడం ఏ విధంగా లాభదాయకం? అని ఆయన ప్రశ్నించారు. యూనిట్ విద్యుత్ రూ.2.49కి కొన్నట్లు ప్రభుత్వం చెబుతున్నా... కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు వెనక్కు తీసుకుంటే డిస్కంలకు చేరేసరికి దాని ధర రూ.3.50 నుంచి రూ.4.50 వరకు పడుతుందన్నారు. ఈ ఒప్పందం వల్ల వచ్చే 25 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలపై రూ.1.20 లక్షల కోట్ల అదనపు భారం పడుతుందని ఆయన వెల్లడించారు.
అదానికీ దొడ్డిదారిన కట్టబెడుతోంది
ఆరు వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మొదట టెండర్లు పిలిస్తే అదానీ సంస్థకు బిడ్ ఖరారైంది. కోర్టు ఆ టెండర్ల ప్రక్రియను రద్దు చేయడంతో... అదే అదానీ సంస్థకు ప్రభుత్వం దొడ్డిదారిన ప్రాజెక్టు కట్టబెడుతోంది. ఇది రూ.30 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుని నామినేషన్ పద్ధతిలో ఇచ్చేయడమే. దీనికి న్యాయ సమీక్ష, రివర్స్ టెండరింగ్ వర్తించవా?’’ అని కేశవ్ నిలదీశారు. ‘‘సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సెకి పిల్చిన టెండర్లలో అదానీ సంస్థ యూనిట్‌కి రూ.2.90కిపైగా కోట్ చేసింది. అంత ధరకు విద్యుత్ కొనేందుకు ఏ రాష్ట్రమూ ముందుకు రాలేదు. అదానీ సంస్థ యూనిట్ ధరను రూ.2.49కి తగ్గించిందని, ఒప్పందం చేసుకోవాలని సెకి సెప్టెంబరు 15న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. వెంటనే కేబినెట్ నోట్ సిద్ధం చేశారు. సెప్టెంబరు 16న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసేసుకున్నారు. రూ.30 వేల కోట్ల పెట్టుబడులపై నిర్ణయం తీసుకునేటప్పుడు లోట్లుపాట్లు చూడరా? అదానీ సంస్థ యూనిట్ ధర రూ.2.49కి తగ్గించిందని సెకి చెబితే ఒప్పందం చేసేసుకోవడమేనా? సోలార్ ప్యానెళ్ల ధరలు గణనీయంగా తగ్గాక కూడా... యూనిట్‌కి రూ.2.49 ప్రభుత్వానికి చౌకగా కనిపించిందా? అదే చౌక ధర అయితే ఇతర రాష్ట్రాలు ఎందుకు కొనడం లేదు?’’ అని కేశవ్ ధ్వజమెత్తారు.