Dhulipalla Fires On CM Jagan: అర్థసత్యాలు, అసత్యాలతో రాష్ట్రంలోని పాడి రైతులను సీఎం మోసగిస్తున్నారని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా లీటర్ పాలకు ఇస్తానన్న 4 రూపాయల బోనస్ జగన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 1950 - 60 దశకాల్లో రాష్ట్రంలో ప్రారంభమైన పాడి రైతుల సహాకార సమాఖ్యల మూసివేతకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
Dhulipalla On Amul Milk: జగన్మోహన్ రెడ్డి అమూల్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ,ఏపీలోని పాల డెయిరీలను నిర్వీర్యం చేస్తున్నారని ధూళిపాళ్ల విమర్శించారు. అమూల్ కోసం 2,500 రూపాయల ప్రభుత్వ సొమ్ము ఖర్చుపెడుతున్న జగన్మోహన్ రెడ్డి, మూతపడిన ఒంగోలు డెయిరీకి 150కోట్లు కేటాయించలేరా..? అని నిలదీశారు. అమూల్ సంస్థ లీటర్ పాలకు 42.50 పైసలు చెల్లిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి రూ.70 అని చెప్పడం పచ్చి అబద్ధం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయడెయిరీ లీటర్ పాలకు 85.55పైసలు ఇస్తుంటే, అమూల్ సంస్థ ఇస్తున్నది కేవలం రూ. 77 మాత్రమేనన్నారు. రూపాయి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేస్తున్న అమూల్ డెయిరీ వల్ల రాష్ట్రానికి అప్పులే మిగులుతాయని ఎద్దేవా చేశారు.
కృష్ణామిల్క్ యూనియన్ సహా, రాష్ట్రంలోని మిల్క్ డెయిరీలను నిర్వీర్యం చేయాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువుల బీమాకు సంబంధించిన సొమ్ముని ఎగ్గొట్టిన వైకాపా ప్రభుత్వం, గోపాల మిత్రల భవిష్యత్ ను అంధకారం చేసిందని దుయ్యబట్టారు. పశువైద్యులు వైద్యసేవలకు స్వస్తిపలికి, ప్రభుత్వం చెప్పే అడ్డమైన పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆక్షేపించారు. సేవాభావంతో పశువులదాణా అమ్మేవారు ప్రభుత్వానికి 25వేల డిపాజిట్ కట్టాలనడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. చిన్నచిన్న సొసైటీలు రూ. 25 వేలు కట్టేస్థితిలో ఉంటాయా అనే ఆలోచన ముఖ్యమంత్రికి లేకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
"సీఎం జగన్ అబద్ధాలతో పాడిరైతులను మోసం చేస్తున్నారు. రెండున్నర ఏళ్లు దాటినా రూ.4 బోనస్ ఎందుకివ్వడం లేదు? సహకార డెయిరీలను జగన్ నిర్వీర్యం చేస్తున్నారు. అమూల్‌కు రూ.2,500 కోట్ల ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేస్తున్నారు.. అలాంటింది మూతపడిన ఒంగోలు డెయిరీకి రూ.150 కోట్లు ఇవ్వలేరా? అమూల్ రూ.42.5 ఇస్తుంటే జగన్ రూ. 70 ఇస్తోందని అంటున్నారు. విజయ డైరీ రూ.85.55 ఇస్తుంటే అమూల్ ఇచ్చేది రూ.77 మాత్రమే. రూపాయి పెట్టుబడి పెట్టని అమూల్ వల్ల అప్పులే మిగులుతాయి. కృష్ణా యూనియన్, ఇతర డెయిరీల నిర్వీర్యమే జగన్ లక్ష్యం. పశుదాణా విక్రేతలను రూ.25 వేల డిపాజిట్ కట్టమనడం దుర్మార్గం. చిన్నచిన్న సంఘాలు రూ.25 వేలు కట్టగలవా అనే విషయాన్ని సీఎం జగన్ ఆలోచించాలి" - ధూళిపాళ్ల నరేంద్ర, తెదేపా సీనియర్ నేత
ఇదీ చదవండి: