ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పంచాయతీ పోరు.. తెదేపా మద్దతుదారుడి అపహరణ.. విడుదల.. - యల్లావుల తిరుపతిరావు

పంచాయతీ పోరు ప్రారంభ ఘట్టంలోనే అలజడి చోటుచేసుకుంది. ప్రకాశం పెదగంజాం సర్పంచి అభ్యర్థిగా తెదేపా బలపరిచిన యల్లావుల తిరుపతిరావు తన నామపత్రాలను దాఖలు చేసేందుకు వెళ్తుండగా... కొందరు వైకాపా నాయకులు అటకాయించి అపహరించారు. నాటకీయ పరిణామాల మధ్య చివరకు అతడిని పెట్టడంతో ఉత్కంఠకు తెరపడింది.

tdp sarpanch candidate missing tragedy
తెదేపా మద్దతుదారు అదృశ్యం

By

Published : Jan 31, 2021, 12:51 PM IST

పంచాయతీ పోరు రసవత్తరంగా మారుతోంది. ప్రకాశం జిల్లాలో తెదేపా మద్దతుదారుడి అపహరణ.. ఘటన కలకలం రేపింది. విషయం తెలిసిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వెంటనే గ్రామానికి చేరుకుని శ్రేణులకు అండగా నిలిచారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ నాయకుల్లో స్థైర్యం నింపారు. విషయం తెలుసుకున్న తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ఎట్టకేలకు పోలీసులు రాత్రి సమయంలో తిరుపతిరావును విడిపించారు. అతని ఫిర్యాదు మేరకు చినగంజాం మండల వైకాపా కన్వీనర్‌ అంకమ్మరెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై అంకమ్మరావు తెలిపారు.

ఉదయం నుంచి రాత్రి వరకు పరిణామాలు ఇలా..

శనివారం ఉదయం 10 గంటలు: చినగంజాం మండలం పెదగంజాం పంచాయతీ శివారు గ్రామమైన ఆవులదొడ్డి పాతగొల్లపాలేనికి చెందిన యల్లావుల తిరుపతిరావు తెదేపా మద్దతుత పెదగంజాం సర్పంచి అభ్యర్థిగా నామినేషన్‌ వేయడానికి సిద్ధపడ్డారు. నాగులుప్పలపాడు మండలంలోని కుక్కలవారిపాలెంలో ఉన్న పోలేరమ్మ ఆలయం వద్దకు పూజలు చేయడానికి వెళ్లారు.

ఉదయం 11 గంటలు:స్వగ్రామానికి సమీపంలో నాగులుప్పలపాడు మండల పరిధిలోని కుక్కలవారిపాలెం గ్రామం ఉంది. అక్కడ అంకమ్మ తల్లి, శ్రీఆంజనేయస్వామి ఆలయాల్లో పూజలు చేసి కార్యక్రమాలను ప్రారంభించడం ఆచారం. గ్రామస్థులు వెంకటేష్‌రెడ్డి, వెంకట రామిరెడ్డి, అంకిరెడ్డితో కలిసి పూజల తర్వాత తిరిగి పెదగంజాం బయలుదేరారు. అదే సమయంలో వైకాపాకు చెందిన కొందరు తిరుపతిరావును అపహరించి వాహనాల్లో తీసుకెళ్లారు. తిరుపతిరావు వెంట ఉన్న వారి చరవాణులను లాగేసుకుని వారిపై దాడి చేశారు.

మధ్యాహ్నం 1 గంట: తిరుపతిరావు అదృశ్యం అయ్యారని స్థానికులకు సమాచారం అందింది.

మధ్యాహ్నం 2 గంటలు:తిరుపతిరావు కుటుంబ సభ్యులు, తెదేపా నాయకులు ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన పోలీసులతో మాట్లాడారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

మధ్యాహ్నం 2.30:తన అనుచరగణంతో ఎమ్మెల్యే ఏలూరి పెదగంజాం బయలుదేరారు. ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి తిరుపతిరావును విడుదల చేయించాల్సిందిగా కోరారు.

మధ్యాహ్నం 3.30:తిరుపతిరావును విడుదల చేయాలంటూ తెదేపా నాయకులు ఆందోళనకు దిగారు.

సాయంత్రం 4:ఎమ్మెల్యే ఏలూరి పెదగంజాం చేరుకున్నారు. పార్టీ నాయకులు, గ్రామస్థులతో కలిసి చినగంజాం పోలీస్‌ స్టేషన్‌ వద్దకు వెళ్లారు. సంఘటన చోటుచేసుకున్న ప్రదేశం నాగులుప్పలపాడు స్టేషన్‌ పరిధిలోనిదని అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు.

సాయంత్రం 6: పెదగంజాం నుంచి ఎమ్మెల్యే ఏలూరి నాగలుప్పలపాడు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు వచ్చారు.

రాత్రి 7 గంటలు: అపహరణకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు చేయడం లేదంటూ నాగులుప్పలపాడు పోలీసులపై ఎమ్మెల్యే ఏలూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్‌లో ఫిర్యాదు తీసుకుని కేసు కట్టకపోవడం ఏంటని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి పోలీసులు తలొగ్గారని ఆరోపించారు. చీరాల డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేయాలని ఇక్కడి పోలీసులు చెప్పడంతో వెనుదిరిగారు.

7.30:కొంత సమయం తర్వాత మళ్లీ నాగులుప్పలపాడు పోలీస్‌ స్టేషన్‌కు పెదగంజాం వాసులు వచ్చారు. అక్కడ నిరసనకు దిగారు.

8.20: అపహరణ విషయం తెలుసుకున్న తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ‘తిరుపతిరావు కిడ్నాప్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏమిటీ ఆటవిక సంస్కృతి. ఎన్నిక అనేది జరగకుండా గెలవడానికి ఆంధ్రప్రదేశ్‌లో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందా? సురక్షితంగా తీసుకొచ్చి నామినేషన్‌ వేయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.. నామినేషన్‌ వేసే అభ్యర్థికి కనీస రక్షణ కూడా కల్పించలేక పోయారంటే శాంతిభద్రతలు ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలి’ అని తన ట్విటర్‌లో పోస్టు చేశారు.

8.50:ఎట్టకేలకు తిరుపతిరావును చినగంజాం పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు.

9.30:పోలీసులకు బాధితుని ఫిర్యాదు.. స్టేట్‌మెంట్‌ నమోదు చేసుకున్న పోలీసులు.

10 గంటలు:తిరుపతిరావు మాట్లాడుతూ.. ఉదయం ఆలయానికి వెళ్లిన సమయంలో నలుగురు వ్యక్తులు తనను అపహరించి చీమకుర్తి ప్రాంతానికి తీసుకెళ్లారని చెప్పారు. అక్కడ పోలీసులు గుర్తించి స్టేషన్‌కు తీసుకొచ్చారని, కిడ్నాప్‌ విషయమై పోలీసులకు తెలిపానన్నారు. అనంతరం భార్య వెంకట రమణ, కుటుంబ సభ్యులతో కలిసి స్టేషన్‌ నుంచి ఇంటికి వెళ్లారు. తెదేపా అధినేత చంద్రబాబు తిరుపతిరావు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి:వేలంలో రూ.36 లక్షలకు సర్పంచి పదవి!

ABOUT THE AUTHOR

...view details