ఎన్నికల ప్రక్రియను మొత్తం రీషెడ్యూల్ చేయాలని తెదేపా డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తెదేపా అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయనివ్వలేదని ఆరోపించారు. విజయవాడలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు దీపక్ రెడ్డి, అశోక్బాబు, బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడారు. వైకాపా ఉచ్చులో కొందరు అధికారులు పడ్డారని ఆరోపించారు. వారిపై విచారణ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. తప్పు చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలి
డోన్, మాచర్లలోనూ తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్ వేయనివ్వలేదని దీపక్ రెడ్డి అన్నారు. నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారని అన్నారు. తాము చేసిన ఫిర్యాదులు అన్నింటిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. అవసరమైనతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని చెప్పారు.