రైతుల కోసం తెలుగుదేశం ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. నేటి నుంచి 3 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా 'రైతు కోసం తెలుగుదేశం' కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తొలిరోజు కార్యక్రమంలో భాగంగా 175 నియోజకవర్గాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతులు, రైతుకూలీల ఇళ్లకు తెదేపా నాయకులు వెళ్లి పరామర్శిస్తున్నారు.
గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను మాజీమంత్రి నక్కా ఆనందబాబు పరామర్శించారు. కౌలు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ విఫలమైందని ఆరోపించారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.20 లక్షలు తగ్గకుండా నష్టపరిహారం అందించాలని నక్కా ఆనందబాబు కోరారు.
రైతులకు 2018, 2019 పంట బీమా చెల్లించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెదేపా నేతలు నిరసన చేపట్టారు. ఇప్పటికైనా స్పందించి రైతుల ఖాతాలో బీమా జమ చేయాలని డిమాండ్ చేశారు.